Fake News, Telugu
 

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ సంస్థ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్

0

13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, తెలుగుదేశం పార్టీకి(TDP) 110-120 సీట్లు, జనసేన పార్టీకి(JSP) 18-20 సీట్లు, వైసీపీకి(YCP) 24-27, బీజేపీకి(BJP) 5-6 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి(INC) 0-1 సీటు వస్తాయని, అలాగే TDP-JSP-BJP కూటమికి 54.75 శాతం ఓట్లు, YCPకి 36 శాతం ఓట్లు, INCకి 05 శాతం ఓట్లు, ఇతరులకు 4.25 శాతం ఓట్లు వస్తాయని ‘ETG Research’ సంస్థ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ సంస్థ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ సర్వే ఫలితాలను ‘ETG Research’ సంస్థ విడుదల చేయలేదు. 07 మే 2024న ఈ సర్వే ఫలితాలపై ETG Research సంస్థ తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ ఈ వైరల్ సర్వే ఫలితాలు ఫేక్ అని, అది పోస్టు చేసిన వ్యక్తితో కానీ ఆ ట్విట్టర్ ఖాతాతో కానీ వారికీ సంబంధం లేదని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ప్రీ-పోల్ సర్వే ఫలితాల గురించి ETG Research’ యొక్క అధికారిక వెబ్‌సైటులో వెతకగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఎలాంటి సర్వే ఫలితాలు ‘ETG Research’ సంస్థ విడుదల చేసినట్లు కనిపించలేదు. తదుపరి మేము ‘ETG Research’ సంస్థ యొక్క అధికారిక X(ట్విట్టర్)ను పరిశీలించగా, ఈ వైరల్ సర్వే ఫలితాలను ‘ETG Research’ సంస్థ విడుదల చేయలేదు అని తెలిసింది. ఈ వైరల్ ప్రీ-పోల్ సర్వే ఫలితాల పై 07 మే 2024న ‘ETG Research’ సంస్థ X(ట్విట్టర్)లో స్పందిస్తూ “@Shakuni_69  ట్విట్టర్ యూజర్ తమ సంస్థ పేరుతో ఓ సర్వేను విడుదల చేసాడు, ఆయనతో కానీ ఆ ట్విట్టర్ అకౌంటుతో కానీ మాకు సంబంధం లేదు, మేము @TimesNow & @TNNavbharat మాత్రమే కలిసి పని చేస్తున్నాము, ప్రస్తుతం జరుగుతన్న లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మా అంచనాలు ఫలితాలు ECI మార్గదర్శకాల ప్రకారం, 01 జూన్ 2024న మాత్రమే విడుదల చేయబడతాయి” అని పోస్ట్ చేసింది.( ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం).

అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ సంస్థ ‘Times Now’ వార్త సంస్థతో కలిసి డిసెంబర్ 2023లో, మార్చ్ 2024లో మరియు ఏప్రిల్ 2024లో  ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసినట్లు తెలిసింది.

 డిసెంబర్‌ 2023లో విడుదల చేసిన ప్రీ-పోల్ సర్వే ఫలితాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికలలో, ఆంధ్రప్రదేశ్‌లోని 25 సీట్లలో YSRCP 24-25 స్థానాల్లో గెలుస్తుందని, TDP ఒక స్థానాన్ని నిలుపుకుంటుందని అంచనా వేసింది. అదేవిధంగా, 2024 మార్చిలో విడుదల చేసిన ప్రీ-పోల్ సర్వే ఫలితాల ప్రకారం, YSRCP 21-22 సీట్లు గెలుస్తుందని, TDP-JSP కూటమి 3-4 సీట్లు గెలుచుకుంటుంది అంచనా వేసింది. తాజాగా ఏప్రిల్ 2024లో విడుదల చేసిన ప్రీ-పోల్ సర్వే ఫలితాల ప్రకారం,YSRCP 19-20 సీట్లు, TDP-JSP-BJP కూటమి 03-04 సీట్లు గెలుచుకుంటుంది అంచనా వేసింది.

అదేవిధంగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థల ప్రీ-పోల్ సర్వే ఫలితాలు అంటూ పలు పోస్టులు వైరల్‌ అయ్యాయి, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG’ సంస్థ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll