Fake News, Telugu
 

చైనాలో 450 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

450 అడుగుల పొడవైన బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చైనాలో ఏర్పాటు చేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఖరీదైన కాంస్య విగ్రహంగా నిలుస్తుందని చెప్తూ నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం యొక్క ఫోటో ఉన్న పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 450 అడుగుల పొడవైన బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చైనాలో ఏర్పాటు చేస్తున్నారు. 

ఫాక్ట్: చైనా ప్రభుత్వం తమ దేశంలో 450 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ముంబైలో ఏర్పాటు చేస్తున్న 450 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం యొక్క కొన్ని భాగాలని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా చైనాలో భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు గురించి ఇంటర్నెట్లో వెతకగా చైనా మరియు భారత మీడియాలో మాకు ఎటువంటి కథనాలు లభించలేదు. 

ఇక వైరల్ పోస్టులోని నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది 2023లో విజయవాడలోని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సమయంలో తీసిన ఫోటోగా ది హిందూ (ఆర్కైవ్) వెబ్సైట్ పేర్కొంది. 125 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ విజయవాడలో ఏర్పాటు(ఇన్స్టాల్) చేసింది. విగ్రహ తయారీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైనా కంపెనీలను సంప్రదించినట్లుగా బిబిసి పేర్కొంది. 

అయితే ముంబైలో నిర్మాణంలో ఉన్న 450 అడుగుల(350 అడుగుల విగ్రహం, 100 అడుగుల పీఠం) అంబేద్కర్ కాంస్య విగ్రహం యొక్క కొన్ని భాగాలని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారు. ఈ విగ్రహం నిర్మాణం పూర్తయితే ‘ఐక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) తర్వాత దేశంలోనే రెండో ఎత్తైన విగ్రహంగా నిలుస్తుంది. 

చివరిగా, చైనా ప్రభుత్వం తమ దేశంలో 450 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 

Share.

About Author

Comments are closed.

scroll