ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు విల్లుతో బాణం ఎలా వేయాలో కూడా తెలియదు అని చెప్తూ , కేజ్రీవాల్ విల్లు మరియు బాణాన్ని రివర్స్ డైరెక్షన్‌లో పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అరవింద్ కేజ్రీవాల్ రివర్స్ దిశలో విల్లు మరియు బాణాన్ని పట్టుకున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): 05 అక్టోబర్ 2022న కేజ్రీవాల్ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన అసలైన ఫోటోలు, వీడియో ఆయన విల్లు మరియు బాణాన్ని సరిగ్గానే పట్టుకున్నట్లు చూపుతున్నాయి. అలాగే, ఇతర సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసిన అనేక ఫోటోలు కూడా అతను సరిగ్గానే విల్లు మరియు బాణాన్ని పట్టుకున్నట్లు చూపుతున్నాయి. వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో షేర్ చేసిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి ఫొటోనే రిపోర్ట్ చేస్తున్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు బిజినెస్ స్టాండర్డ్ వార్తా కథనాలను కనుగొన్నాము. ఈ ఫోటోలలో, అరవింద్ కేజ్రీవాల్ విల్లు, బాణాన్ని సరిగ్గా పట్టుకోవడం చూడవచ్చు.
అలాగే 05 అక్టోబర్ 2022న కేజ్రీవాల్ తన అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా రాంలీలా మైదానంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఇతర ఫోటోలోతో పాటు ఈ ఫోటోని కూడా షేర్ చేశారు. అంతేకాకుండా, కేజ్రీవాల్ ఈ కార్యక్రమం యొక్క వీడియోను కూడా పోస్ట్ చేశారు, దీనిలో ఆయన విల్లు మరియు బాణాన్ని సరిగ్గా పట్టుకుని 1:48 నిమిషాలకు సరైన దిశలోనే బాణాన్ని విడుదల చేయడం చూడవచ్చు. ఇతర సోషల్ మీడియా వినియోగదారులు కూడా కేజ్రీవాల్ విల్లు మరియు బాణాన్ని సరిగ్గా పట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేశారు (ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు). దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది అని నిర్ధారించవచ్చు.
చివరగా, కేజ్రీవాల్ విల్లు మరియు బాణాన్ని రివర్స్ దిశలో పట్టుకున్నట్లు చూపిస్తున్న ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడింది.