Fake News, Telugu
 

15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి అయిన ఖర్చు తిరిగిచ్చే పథకం ఇంకా మొదలవలేదు

0

అప్డేట్ (30 జనవరి 2024): ‘పర్యాటన్ పర్వ్’ పేరుతో 15 పుణ్యక్షేత్రాలు దర్శించిన హిందువులకి డబ్బుని చెల్లించే పథకం ఏదీ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిసెంబర్ 2022లో కూడా స్పష్టం చేశారు.

హిందూ సనాతన ధర్మం అందరికి తెలిసే విధంగా ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇచ్చే విధంగా మోదీ ప్రభుత్వం ‘పర్యాటన్ పర్వ్’ అనే పథకం తీసుకువచ్చిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ సనాతన ధర్మం అందరికి తెలిసే విధంగా ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇచ్చే విధంగా పర్యాటన్ పర్వ్ అనే పథకం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఫాక్ట్: 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి వారి పర్యటనకి అయిన ఖర్చు ఇన్సెంటివ్ రూపంలో తిరిగి ఇవ్వబడుతుందని టూరిజం మంత్రి అయిన ప్రహ్లద్ సింగ్ పటేల్ జనవరి 2020లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నప్పటికీ, ఖర్చులు ఇన్సెంటివ్ రూపంలో తిరిగి ఇచ్చే పథకమేది అమలులో లేదని డిసెంబర్ 2021లో లోక్ సభలో ఒక ప్రశ్నకి జవాబిస్తూ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పైగా ఈ పథకం కేవలం హిందువులకి మాత్రమేనని ఎక్కడ కూడా లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.          

పోస్టులో చెప్పిన విషయం గురించి గూగుల్ సెర్చ్ చేయగా దానికి సంబంధించిన ఆర్టికల్ మాకు లభించింది. ఈ ఆర్టికల్ ప్రకారం, 25 జనవరి 2020న ఒడిశాలో జరిగిన నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర టూరిజం మంత్రి అయిన ప్రహ్లద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ పర్యాటన్ పర్వ్ ఇనిషియేటివ్ కింద 2022 లోపు ఒక ఏడాదిలో 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి పర్యటనకి అయిన ఖర్చు ఇన్సెంటివ్ రూపంలో తిరిగి ఇవ్వబడుతుందని చెప్పారు. ఐతే ఈ స్కీం కేవలం హిందువులకు మాత్రమేనని మంత్రి అనలేదు. ఇంకా ఈ స్కీం కేవలం హిందువులకే అని ప్రభుత్వ గైడ్లైన్స్ లో కానీ, వార్తా కథనాల్లో గాని ఎక్కడా లేదు. ఇంకా ఈ కార్యక్రమం కింద కేవలం పుణ్యక్షేత్రాలు సందర్శించాలని కూడా ఎక్కడా లేదు.

ఐతే 13 డిసెంబర్ 2021న, లోక్ సభలో ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకి టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి బదులిస్తూ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి అయిన ఖర్చులు తిరిగి ఇచ్చే పథకమేదీ అమలులో లేదని చెప్పాడు. కాకపోతే టూరిజం మంత్రిత్వ శాఖ భారత దేశంలో స్థానిక టూరిజం ప్రోత్సహించడం కొరకు ‘దేఖో అప్నా దేశ్’ అనే కార్యక్రమం మొదలుపెట్టిందని చెప్పారు. దీని ద్వారా ప్రజలని 2022 లోపు భారత దేశంలోని 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించేలాగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. దీన్ని బట్టి పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం తిరిగి ఇచ్చే పథకం ఇంకా అమలు కాలేదని కచ్చితంగా చెప్పొచ్చు. 

భారత దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంలో నిర్వహిస్తున్న ‘దేఖో అప్నా దేశ్’, ‘టూరిజం ఫర్ అల్’ వంటి కార్యక్రమాలని ప్రోత్సహించడానికి ‘పర్యాటన్ పర్వ్’ 2019 వంటి కార్యక్రమాలు తీసుకున్నామని టూరిజం మంత్రిత్వ శాఖ తమ 2019-2020 వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అయితే, టూరిజం మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన 2020-2021 నివేదికలో మాత్రం ‘పర్యాటన్ పర్వ్’ అనే కార్యక్రమం గురించి ప్రస్తావనే లేదు. టూరిజం మంత్రిత్వ శాఖ వెబ్సైటులో కూడా పర్యాటన్ పర్వ్ ఇటీవల జరిగినట్టుగా లేదు. కానీ, మార్చ్ 2021లో ప్రచురించిన లోక్ సభకు సంబంధించిన రీసెర్చ్ బ్రీఫ్ లో భారత్ పర్వ్, పర్యాటన్ పర్వ్ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

టూరిజం మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్, ప్రశాద్ (PRASHAD) వంటి స్కీంలను నడుపుతుంది. ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇస్తారని ఈ పథకాల్లో లేదు. ఈ పథకాలు కేవలం హిందువులకే అని కూడా ఎక్కడా లేదు.

చివరగా, 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి అయిన ఖర్చు తిరిగిచ్చే పథకం ఇంకా మొదలవలేదు.

Share.

About Author

Comments are closed.

scroll