Fake News, Telugu
 

హోటల్లో నుండి బయటకు వస్తున్న కాంగ్రెస్ నేతల వీడియోను బార్ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు

0

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కేరళలో పర్యటిస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ తదితరులు కేరళలోని ఒక బార్‌లో మద్యం సేవించి బయటకు వస్తున్న దృశ్యాలు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కేరళలోని ఒక బార్‌లో మద్యం సేవించి బయటకు వస్తున్న రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియోలో కాంగ్రెస్ నేతలు బయటకు వస్తున్నది కేరళలో కొల్లాం జిల్లాలోని ఓచిరా పట్టణంలో ఉన్న “మలబార్” హోటల్ నుండి. భారత్ జోడో యాత్ర లో భాగంగా సెప్టెంబర్ 17న ఈ పట్టణానికి వచ్చిన రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్  నేతలు ఆ రోజు ఉదయం ఈ హోటల్లో టిఫిన్ చేశారు. ఆ సమయంలో హోటల్లో ఎటువంటి మద్యం సరఫరా చేయలేదు అని హోటల్ ఓనర్ అన్సర్ మలబార్ తెలిపారు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

ముందుగా, మలయాళం భాషలో వెతకగా, ‘అను అశోక్’ అనే ఫేస్బుక్ యూసర్ ఇదే వీడియోను పోస్టు చేస్తూ “ఇది ఓచిరా లో ఉన్న ఆన్సర్ అమీన్ మలబార్ టి షాప్. ఇది బార్ కాదు” అని వివరించారు.   

ఇక దొరికిన సమాచారంతో, మేము ఈ విషయం గురించి వెతకగా, ఈ హోటల్‌కు సంబంధించిన వివిధ ఫొటోలు లభించాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న దృశ్యాలను ఈ ఫొటోలతో పోల్చితే, రెండూ ఒకే ప్రదేశాన్ని చూపిస్తున్నాయని నిర్ధారించవచ్చు.

ఈ హోటల్ గురించి వివిధ వెబ్సైట్లలో వెతకగా, ఎక్కడా కూడా ఇది బార్ అని లేదు. సంబంధిత వెబ్‌సైటులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ హోటల్ కొల్లాం జిల్లాలోని ఓచిరా ప్రాంతం లో ఉంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతలు,  సెప్టెంబర్ 17న ఉదయం ఓచిరాలో ఉన్న మలబార్ హోటల్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంటులో అదే రోజు లైవ్ స్ట్రీమ్ లో 1:17:00 దగ్గర చూడవచ్చు.

ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే హోటల్ దగ్గర తీసిన వీడియోలు, ఫోటోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

మేము మలబార్ హోటల్ ఓనర్ అయిన ఆన్సర్ మలబార్ తో మాట్లాడగా, “రాహుల్ గాంధీ తదితరులు మా హోటల్ కు 17 సెప్టెంబర్ ఉదయం టిఫిన్ చేయడానికి వచ్చారు. మా హోటల్ లో ఎటువంటి మద్యం సరఫరా చేయము. ఆరోజు కూడా చేయలేదు. బయట వందల మంది కార్యకర్తలు మరియు పోలీసులు ఉన్నప్పుడు అలా మద్యం సేవించడం సాధ్యం కాదు. రాహుల్ గాంధీ కేవలం కాఫీ, కేకు, ఆమ్లెట్ మాత్రమే తీసుకున్నారు. మిగతా నాయకులు పరోట, అప్పం, టీ వంటివి తీసుకున్నారు” అని అన్నారు. హోటల్ ఓనర్ మాకు పంపిన CCTV వీడియో ను ఇక్కడ చూడవచ్చు .

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తప్పుడు ప్రచారంగా ఖండించారు. ఇటువంటి ప్రచారం చేసిన వారి పైన కేరళ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. అయితే, అక్కడ ఉన్న నాయకులు బయట మద్యం సేవించారా లేదా అన్న విషయం ధృవీకరించలేము.

చివరిగా, హోటల్లో నుండి బయటకు వస్తున్న గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల వీడియోను బార్ నుండి బయటకి వస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll