Fake News, Telugu
 

ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది ఒవైసీ సభలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య లియోనా కాదు

0

ఒవైసీ సమావేశంలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన అమ్మాయిని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కౌగిలించుకున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. 2020 ఫిబ్రవరి నెలలో కర్ణాటకలో అసదుద్దీన్ ఒవైసీ హాజరయిన ఒక బహిరంగ సభలో అమూల్య లియోనా ‘పాకిస్థాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేసింది. 2024 ఎన్నికలకు ముందు జాతి వ్యతిరేకులందరిని ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: అసదుద్దీన్ ఒవైసీ సభలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాను రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రలో కలుసుకున్నారు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో రాహుల్ గాంధీ కౌగిలించుకున్నది కేరళ స్టూడెంట్ యూనియన్ ఎర్నాకుళం జిల్లా సెక్రెటరీ మివా ఆండ్రిలియో, ఒవైసీ సభలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య లియోనా నొరోన్హా కాదు. ఈ ఫోటోని ఆండ్రిలియో 21 సెప్టెంబర్ 2022 నాడు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ట్వీట్ చేస్తూ కొందరు యూసర్లు ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది కేరళ స్టూడెంట్ యూనియన్ (KSU) లీడర్ మివా జాలీ అని తెలిపారు. ఆ ట్వీట్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇదే ఫోటో మివా ఆండ్రిలియో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దొరికింది. “నా జీవితంలో అత్యంత ఆనందించదగ రోజు. మన రాగా” (తెలుగులో అనువధించిన తరువాత), అని తెలుపుతూ మివా ఆండ్రిలియో ఈ ఫోటోని 21 సెప్టెంబర్ 2022 నాడు షేర్ చేసింది. రాహుల్ గాంధీని తాను కలుసుకున్న వీడియోని కూడా మివా జాలీ మరొక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేసింది.  

 

మివా ఆండ్రిలియో కేరళ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఎర్నాకుళం జిల్లా సెక్రెటరీ అని తెలిసింది. KSU అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ తరుపున కేరళలో పనిచేస్తున్న ఒక విద్యార్థి విభాగం. మివా ఆండ్రిలియో షేర్ చేసిన మరికొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలలో తాను KSU జెండాలను పట్టుకున్న దృశ్యాలను చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది KSU మెంబర్ మివా జాలీ అని స్పష్టం చేస్తూ పలు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్స్ మరియు కాంగ్రెస్ నాయకులు ట్వీట్లు పెట్టారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసినందుకు అరెస్ట్ అయిన బెంగుళూరు విధ్యార్ధిని అమూల్య లియోనా, 2020 జూన్ నెలలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలయ్యారు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు కనిపిస్తున్నది అమూల్య లియోనా కాదు, KSU లీడర్ మివా ఆండ్రిలియో.

చివరగా, ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు కనిపిస్తున్నది KSU ఎర్నాకుళం సెక్రెటరీ మివా ఆండ్రిలియో, ఒవైసీ సభలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య లియోనా కాదు.  

Share.

About Author

Comments are closed.

scroll