Fact Check, Fake News, Telugu
 

2014 కన్నా ముందు కూడా మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు అందించారు.

0

2014 కన్నా ముందు మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వలేదని, ఐతే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర పథకం ద్వారా అందించిన రుణాలలో 79% రుణాలు మహిళలే పొందారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 79% ముద్ర రుణాలు మహిళలే పొందారు, 2014 కన్నా ముందు మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వలేదు.

ఫాక్ట్(నిజం): 2014 కన్నా ముందు కూడా మహిళలు పూచీకత్తు లేకుండా రుణాలు పొందారు. 2000వ సంవత్సరంలో ప్రారంభించిన CGTMSE స్కీం కింద చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు పూచీకత్తు లేకుండా 1 కోటి రూపాయల వరకు రుణాలు అందించారు. ఈ స్కీం కింద మహిళలు పూచీకత్తులేని రుణాలు పొందారు. ఇంకా 2015-16 నుండి 2019-20 ఐదేళ్ళ కాలంలో ముద్ర రుణాల పొందిన అకౌంట్స్ లో 68% అకౌంట్స్ మహిళ లబ్దిదారులకు చెందినవైతే, ఈ ఐదేళ్ళ కాలంలో పంపిణి పంపిణీ చేయబడ్డ మొత్తం నగదులో 43% మాత్రమే మహిళా లబ్దిదారులు పొందారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2014 కన్నా ముందు మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వలేదా?

చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు ఆర్ధిక చేయూతనందించే ఉద్దేశంతో 2000వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises (CGTMSE) ని ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా కొత్త మరియు అప్పటికే స్థాపించబడ్డ చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు 1 కోటి రూపాయల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు పొందవచ్చు. మహిళల యాజమాన్యంలో ఉన్నా లేదా మహిళలచే నిర్వహించబడుతున్న చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఈ స్కీం ద్వారా 50 లక్షల వరకు పొందే రుణాలకు 80% గ్యారంటీ కవర్ అందిస్తుంది. ఈ స్కీంకి సంబంధించిన కార్పస్ ఫండ్ లో కేంద్ర ప్రభుత్వం (GoI) మరియు SIDBI (Small Industries Development Bank of India) 4:1 నిష్పత్తి లో జమచేస్తాయి. 2016లో ఈ స్కీం ద్వారా పూచీకత్తు లేకుండా పొందగలిగే మొత్తాన్ని 2 కోట్లకు పెంచారు.

ఈ స్కీంని పలు బ్యాంకులు వివిధ పేర్లతో అందిస్తున్నాయి. ఈ స్కీం ద్వారా 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల ద్వారా అందించిన రుణాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ పొందవచ్చు.. 

Swarnajayanti Gram Swarozgar Yojana (SGSY):

పథకం1999లో ప్రారంభించారు. పేదలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడం, మౌలిక సదుపాయాలు కల్పించడం మరియు వారి ఉతప్తులకు మార్కెటింగ్ వంటి స్వయం ఉపాధికి సంబంధించిన అన్ని అంశాలను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఐతే ఇంతకుముందున్న Integrated Rural Development Program (IRDP) మరియు దిని అనుబంధ పధకాలైన Development of Women & Children in Rural Areas (DWCRA), Million Wells Scheme (MWS), Ganga Kalyan Yojana (GKY) వంటి ఆరు పథకాలు కలిపి ఈ పథకంగా రూపొందించారు. ఈ స్కీం ద్వారా కేంద్రం మరియు రాష్టాలు 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. ఐతే ఈ పథకం ద్వారా మంచి సామర్థ్యాన్ని ప్రదర్శించిన స్వయం సహాయక బృందాలుకు(SHG) బ్యాంకుల ద్వారా రేవోల్వింగ్ ఫండ్ కింద రూ. 25,000 క్రెడిట్ అందిస్తున్నాయి, ఐతే బ్యాంకులు రూ. 10,000 దాటిన వాటికి మాత్రమే వడ్డీ ఛార్జ్ చేస్తాయి.

వీటన్నిటి ఆధారంగా 2014 కన్నా ముందు కూడా మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు అందించారని కచ్చితంగా చెప్పొచ్చు.

79% ముద్ర రుణాలు మహిళలకు :

చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఆర్ధిక చేయూతనందించే ఉద్దేశంతో ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకం క్రింద MUDRA (Micro Units Development and Refinance Agency Ltd)  లోన్ అందిస్తుంది. ఈ పథకం క్రింద నాన్-ఫార్మింగ్ మరియు నాన్-కార్పొరేట్ మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్సు బ్యాంక్స్, MFI’s మరియు NBFC’s మొదలైన సంస్థల ద్వారా ముద్ర రుణాలు పొందవచ్చు.

ముద్ర వెబ్సైటు లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2015-16 నుండి 2019-20 ఐదేళ్ళ కాలంలో 24,48,30,488 అకౌంట్స్ ద్వారా లబ్దిదారులు రుణాలు పొందగా అందులో 68% అంటే 16,64,99,308 అకౌంట్స్ మహిళ లబ్దిదారులకు చెందినవే. కాకపోతే ఈ ఐదేళ్ళ కాలంలో పంపిణీ చేయబడ్డ 11,96,231 కోట్ల రూపాయల్లో మహిళ లబ్దిదారులు పొందింది 5,13,610 కోట్ల రూపాయలు మాత్రమే, అనగా మొత్తం పంపిణి చేసిన రుణాలలో 43% మాత్రమే మహిళా లబ్దిదారులు పొందింది.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ముద్ర రుణాలు పొందినవారిలో 79% మంది మహిళలే అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కేవలం 2015-16 లో మాత్రమే మొత్తం రుణాలు పొందిన అకౌంట్స్ లో మహిళలవి 79% ఉన్నాయి, మిగతా ఏ సంవత్సరంలో కూడా మొత్తం రుణాలు పొందిన అకౌంట్స్ లో మహిళల అకౌంట్స్ అంత శాతం లేవు. పైగా ఈ స్కీం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా పంపిణీ చేయబడ్డ మొత్తం నగదులో మహిళలు 50% కి మించి పొందలేదు.

చివరగా, 2014 కన్నా ముందు కూడా మహిళలు పూచీకత్తు లేకుండా రుణాలు పొందారు.

Share.

About Author

Comments are closed.

scroll