Fake News, Telugu
 

మహిళ తన కూతురికి రక్తం ప్యాకెట్ పట్టుకున్న ఈ ఫోటో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది, ఉత్తరప్రదేశ్‌కి సంబంధించినది కాదు

0

బ్లడ్ బ్యాగ్ పెట్టేందుకు స్టాండ్ కూడా లేని దయనీయమైన స్థితలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆసుపత్రులు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. నేలపై కూర్చున్న చిన్నారికి రక్తం ఎక్కించేందుకు తన తల్లి బ్లడ్ బ్యాగును చేతిలో పట్టుకున్న దృశ్యాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ది ఇదీ అని ఈ పోస్టులో ఎద్దేవా చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని ఆసుపత్రిలో ఒక మహిళ బ్లడ్ బ్యాగ్ పట్టుకొని తన కూతురికి రక్తం ఎక్కిస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న ఘటన ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం సాట్నా జిల్లాలోని మైహార్ సివిల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మైహార్ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న ఒక 15 ఏళ్ల బాలికను ఇలా నేలపై కూర్చోబెట్టి రక్తం ఎక్కించారు. ఈ ఫోటో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కానప్పటికి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘NDTV’ వార్తా సంస్థ 15 సెప్టెంబర్ 2022 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో 15 ఏళ్ల బాలికను నేలపై కూర్చోబెట్టి రక్తం ఎక్కిస్తున్న దృశ్యమని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. రక్తం సరిగా సరఫరా అయ్యేందుకు చిన్నారి తల్లి నిలబడి బ్లడ్ బ్యాగుని చేతిలో పట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సాట్నా జిల్లాలోని మైహార్ సివిల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్నట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఫోటోలో బ్యాగ్ పట్టుకొని నిలుచున్న మహిళ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉన్న తన కూతురిని చికిత్స కోసం మైహార్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో చిన్నారిని నేలపై కూర్చోబెట్టి రక్తం ఎక్కించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అనురాగ శర్మ, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది.

చివరగా, మహిళ బ్లడ్ బ్యాగ్ పట్టుకొని తన కూతురికి రక్తం ఎక్కిస్తున్న ఈ ఫోటో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది, ఉత్తరప్రదేశ్‌కి సంబంధించినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll