Fake News, Telugu
 

బంగ్లాదేశ్ హజ్ యాత్రికులకు సంబంధించిన ఫోటోను కేరళ ప్రభుత్వానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

శబరిమల యాత్రికులు బస్సులో ఇబ్బందిగా కూర్చున్న ఫోటోను హజ్ యాత్రికులు సౌకర్యంగా ప్రయాణిస్తున్న ఫోటోతో పోల్చుతూ కేరళ ప్రభుత్వం శబరిమల యాత్రికుల పట్ల పక్షపాత వైఖరిని చూపిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఉపయోగించి హజ్ యాత్రికులు సౌకర్యంగా ప్రయాణిస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): కేరళ ప్రభుత్వం హజ్ యాత్రికులకు సౌకర్యమైన ఏర్పాట్లు చేసిందనే ఉద్దేశంలో షేర్ చేసిన ఈ ఫోటో బంగ్లాదేశ్ హజ్ యాత్రికులకు సంబంధించింది. గత కొన్ని సంవత్సరాలుగా హజ్ యాత్రకు సంబంధించి అక్కడి వార్తా కథనాలు ఇవే ఫోటోను ఉపయోగిస్తున్నాయి. కాగా ఇటీవల శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలలో కేరళ ప్రభుత్వం విఫలమైందనని అనేక  విమర్శలు వచ్చాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అనేక  విమర్శలు వచ్చాయి. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అయ్యప్ప భక్తులు నిరసనకు దిగినట్టు కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ప్రస్తుతం షేర్ అవుతున్న అయ్యప్ప భక్తులు బస్సులో ఇబ్బందిగా కూర్చున్న ఫోటో కూడా ఈ క్రమంలో వార్తా కథనాలు రిపోర్ట్ చేసిందే.

ఐతే ఈ క్రమంలోనే హజ్ యాత్రికుల కోసం కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు అంటూ షేర్ చేసిన ఫోటోతో మాత్రం కేరళతో ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటో బంగ్లాదేశ్ హజ్ యాత్రికులకు సంబంధించింది. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా బంగ్లాదేశీయుల హజ్ యాత్రకు సంబంధించి అక్కడి వార్తా సంస్థలు ఇలాంటివే ఫోటోలను ప్రచురించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తులు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న వ్యక్తులు ఒక్కరే.

కానీ ఈ ఫోటో ఎప్పుడు తీసిందో కచ్చితమైన సమాచారం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా హజ్ యాత్రకు సంబంధించి అక్కడి వార్తా కథనాలు ఇవే ఫోటోను ఉపయోగిస్తున్నాయి. కాకపోతే ఈ కథనాల బట్టి ఈ ఫోటోతో కేరళ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం హజ్ యాత్రికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో  కేరళ ప్రభుత్వం కూడా హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వార్తా కథనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో మాత్రం బంగ్లాదేశ్ హజ్ యాత్రికులకు సంబంధించింది.

చివరగా, బంగ్లాదేశ్ హజ్ యాత్రికులకు సంబంధించిందిన ఫోటోను కేరళ ప్రభుత్వానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll