Fake News, Telugu
 

దళిత మహిళపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశారంటూ ఒడిశాలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తున్నారు

0

తన పొలంలోని బోరు బావి దగ్గర నీళ్లు తాగిందని దళిత మహిళని స్తంభానికి కట్టేసి కొట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా స్తంభానికి కట్టేసి ఉన్న మహిళ ఫోటో ఒకటి జత చేశారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తన పొలంలోని బోరు బావి దగ్గర నీళ్లు తాగిందని, దళిత మహిళని స్తంభానికి కట్టేసి కొట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.

ఫాక్ట్ (నిజం): చింతమనేని ప్రభాకర్ దళిత మహిళను స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడినట్లు ఎలాంటి వార్త కథనాలు లేవు. ఇటీవల ఒడిశాలో తల్లిపై కొడుకు దాడి చేసిన సంఘటనకు సంబంధించిన ఫోటోను చింతమనేని ప్రభాకర్ దళిత మహిళపై దాడి చేసినట్లు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ క్లెయిమ్ గురించి కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, దళిత మహిళని స్తంభానికి కట్టేసి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడినట్లు ఏ న్యూస్ ఛానల్ లేదా వార్తా పత్రిక కథనం లభించలేదు. కాగా, ఈ పోస్టులో ఉన్న ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఇదే ఫొటోను పలు వార్తా పత్రికలు ప్రచురించినట్టు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

వార్త కథనాల ప్రకారం, “ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని సరసపాసి గ్రామంలో 70 ఏళ్ల వృద్ధురాలు తన చిన్న కుమారుడి పొలంలో పండించిన కూరగాయలను (కాలీఫ్లవర్)  తెంపడంతో వివాదం చోటుచేసుకుంది, వాగ్వాదం పెరగడంతో కొడుకు ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు”. దీనిబట్టి వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోకు మరియు కథనానికి చింతమనేని ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని నిర్ధారించవచ్చు.

చివరగా, ఒడిశాలో జరిగిన సంఘటనకు సంబంధించిన ఫోటోను చింతమనేని ప్రభాకర్ దళిత మహిళపై దాడి చేసినట్లు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll