Fake News, Telugu
 

2024 రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో మూడో స్థానం లభించింది.

0

ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మొదటి బహుమతి లభించింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2024 రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మొదటి బహుమతి వచ్చింది.

ఫాక్ట్(నిజం): వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రూపొందించిన శకటాలపై పీపుల్స్ ఛాయిస్ విభాగంలో విజేత ఎంపిక కోసం జనవరి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో ఆంధ్ర ప్రదేశ్ శకటానికి మూడో స్థానం దక్కగా, మొదటి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం నిలిచింది.అలాగే జడ్జీలు ఎంపికలో ఒడిశా మొదటి స్థానంలో నిలిచింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

‘వికసిత్ భారత్’ , ‘భారత్ – లోక్ తంత్ర్ కి మాతృక’ అనే జంట థీమ్లతో 2024 రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈసారి జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర వేడుకల పరేడ్ లో భాగంగా కర్తవ్య పథ్‌లో పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 28 శకటాలను ప్రదర్శించారు.

కాగా వికసిత భారత్ థీమ్‌లో భాగంగా రూపొందించిన శకటాలపై, పీపుల్స్ ఛాయిస్ అనే విభాగంలో విజేత ఎంపిక  కోసం జనవరి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో 32శాతం ఓట్లతో మొదటి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం నిలిచింది, అలాగే 17శాతం ఓట్లతో ఉత్తర్ ప్రదేశ్ శకటం రెండవ స్థానంలో, 12శాతం ఓట్లతో ఆంధ్ర ప్రదేశ్ శకటం మూడవ స్థానంలో నిలిచాయి. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ శకటాన్ని రూపొందించారు.ఇదే విషయాన్ని తెలియజేస్తున్న పలు మీడియా కథనాలు ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

అలాగే జడ్జీలు ఎంపిక విభాగంలో ఒడిశా మొదటి స్థానంలో నిలిచింది, ఒడిశా శకటం కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను సాదించడంపై సందేశాలతో పాటు రఘురాజ్‌పూర్ వారసత్వ హస్తకళల ద్వారా అద్భుతమైన హస్తకళల కళాత్మకతను ఈ శకటంలో ప్రదర్శించారు. అలాగే రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో తమిళనాడు నిలిచాయి. ఇదే విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(MOD) అధికారిక ప్రతినిధి భారత్ భూషణ్ బాబు తన అధికారిక  X (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు .

చివరగా, 2024 రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో మూడో స్థానం లభించింది.

Share.

About Author

Comments are closed.

scroll