Fake News, Telugu
 

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించి షేర్ చేస్తున్న ఈ ABN బ్రేకింగ్ న్యూస్ వీడియో ఎడిట్ చేయబడినది

0

ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ భార్య మరియు కూతురు ముంబై రెడ్ లైట్ ఏరియాలో పట్టుబడ్డారంటూ ABN న్యూస్ ఛానెల్ టెలికాస్ట్ చేసిన న్యూస్ రిపోర్ట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. అంతేకాదు, 100 కోట్ల పాలసీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే రాధాకృష్ణ తన భార్యను చంపేసినట్టు ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముంబై రెడ్ లైట్ ఏరియాలో ABN ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భార్య మరియు అతని కూతురు పట్టుబడినట్టుగా షేర్ చేస్తున్న ABN న్యూస్ చానెల్ వీడియో.

ఫాక్ట్ (నిజం): ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ యొక్క కుటుంబానికి సంబంధించి అటువంటి రిపోర్ట్ ఏది ABN న్యూస్ ఛానెల్ పబ్లిష్ చేయలేదు. 2021లో రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ గుండెపోటుతో మరణించారు. ఆమెది సహజ మరణమే అని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కనకదుర్గ మరణానికి సంబంధించి రాధాకృష్ణకు అతని కొడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని గానీ, ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తపరుస్తూ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్టు గానీ ఎక్కడా సమాచారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఆంధ్రజ్యోతి  ఎండీ రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించి అటువంటి రిపోర్ట్ ఏది ABN న్యూస్ ఛానెల్ టెలికస్ట్ చేయలేదని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ABN న్యూస్ వీడియోలో ముంబై పేరుని ముంబాయి అని తప్పుగా రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. అంతేకాదు, వీడియోలో కనిపిస్తున్న బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్, ప్రస్తుత ABN న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్‌తో పోలి లేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసినది ఎడిట్ చేయబడిన వీడియో అని తెలుస్తుంది.

2021లో వేమూరు రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆమె మరణాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. కనకదుర్గ మరణానికి సంబంధించి రాధాకృష్ణకు అతని కొడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని గానీ , ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తపరుస్తూ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్టు గానీ ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం మేము ABN న్యూస్ ఛానెల్‌కు మెసేజ్ పెట్టము. వారి నుండి సమాధానం వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.

ఇదివరకు, ABN న్యూస్ ఛానెల్ టెంప్లేట్లను ఎడిట్ చేసి రూపొంధించిన పలు ఫేక్ వీడియోలు లేదా ఫోటోలకు సంబంధించి ఫాక్ట్‌లీ ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించి షేర్ చేస్తున్న ఈ ABN బ్రేకింగ్ న్యూస్ వీడియో ఎడిట్ చేసినది.

Share.

About Author

Comments are closed.

scroll