“భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉంది, హిందువుల సంతానోత్పత్తి రేటు వారిలో సగం కంటే తక్కువ, కనీసం 2గా కూడా లేదు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే ఈ పోస్టుతో పాటు భారతదేశంలో మతాల వారీగా సంతానోత్పత్తి రేట్లను చూపిస్తున్న జాబితాను కూడా షేర్ చేస్తున్నారు, ఇందులో భారతదేశంలోని వివిధ మతాల సంతానోత్పత్తి రేట్లను పేర్కొన్నారు, అవి ఇలా ఉన్నాయి: ముస్లింలు- 4.4, హిందువులు-1.94, సిక్కులు-1.61, క్రైస్తవులు-1.88, జైనులు-1.6, బౌద్ధులు-1.39. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉంది, హిందువుల సంతానోత్పత్తి రేటు వారిలో సగం కంటే తక్కువ, కనీసం 2గా కూడా లేదు.
ఫాక్ట్(నిజం): మార్చి 2022లో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) రిపోర్టు ప్రకారం, భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.36గా ఉంది మరియు హిందువుల సంతానోత్పత్తి రేటు 1.94గా ఉంది. అలాగే, మిగితా మతాల సంతానోత్పత్తి రేటు ఇలా ఉన్నాయి సిక్కులు-1.61, క్రైస్తవులు-1.88, జైనులు-1.6, బౌద్ధులు-1.39. పోస్టులో పేర్కొన్న ముస్లింల సంతానోత్పత్తి రేటు (4.4) మొదటి NFHS రిపోర్టులో (1992–1993) నమోదు చేయబడింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉందా? అని తెలుసుకోవడానికి, మేము మార్చి 2022లో భారత జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5), 2019–21 రిపోర్టును పరిశీలించాము. ఈ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని వివిధ మతాల సంతానోత్పత్తి రేట్లు ఇలా ఉన్నాయి: ముస్లింలు-2.36, హిందువులు-1.94, సిక్కులు-1.61, క్రైస్తవులు-1.88, జైనులు-1.6, బౌద్ధులు-1.39. దీన్ని బట్టి వైరల్ పోస్ట్‌లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు మరియు బౌద్ధుల సంతానోత్పత్తి రేటు సరిగ్గా పేర్కొన్నప్పటికీ ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4 అని తప్పుగా పేర్కొనబడింది అని తెలుస్తుంది. తాజా NFHS-5 రిపోర్టు ప్రకారం ప్రకారం భారతదేశంలో ముస్లిం సంతానోత్పత్తి రేటు 2.36గా ఉంది. ఐదవ NFHS సర్వే (2019–21) రిపోర్టును ఇక్కడ చూడవచ్చు (ఆర్కైవ్డ్ లింక్).

ఈ క్రమంలోనే, మొదటి NFHS (1992-1993) రిపోర్టు (ఆర్కైవ్డ్ లింక్ ) ప్రకారం, భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉన్నట్లు మేము కనుగొన్నాము. దీన్నిబట్టి మొదటి NFHS (1992-1993) రిపోర్టులో పేర్కొన్న ముస్లిం సంతానోత్పత్తి రేటును మరియు NFHS-5 రిపోర్టులో పేర్కొన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు మరియు బౌద్ధులకు సంబంధించిన సంతానోత్పత్తి రేటు డేటాతో జోడించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మనం నిర్ధారించవచ్చు.

ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-2021) గణాంకాల ప్రకారం, మిగతా మతాలతో పోల్చితే ముస్లింలలో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది. అయితే, గత రెండు దశాబ్దాల్లో, ముస్లింలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని వివిధ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్టుల డాటా చెప్తోంది. మొదటి NFHS (1992-1993) సర్వే రిపోర్టులో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉండగా, అది 2022 నాటికి 2.36కి తగ్గింది. అలాగే మొదటి NFHS (1992-1993) సర్వే రిపోర్టులో హిందువుల సంతానోత్పత్తి రేటు 3.3గా ఉండగా, అది 2022లో 1.94గా ఉంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ ).

భారతదేశంలోముస్లిం జనాభాకు సంబంధించి పలు తప్పుడు డేటాతో కూడిన పలు పోస్టులు వైరల్ కాగా వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన పలు ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, తాజాగా మార్చి 2022లో విడుదలైన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) రిపోర్టు (2019–2021) ప్రకారం భారతదేశంలో ముస్లిం సంతానోత్పత్తి రేటు 2.36గా ఉంది.