“1947 నుండి 2017 మధ్య కాలంలో అనగా 70 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్న ముస్లింల జనాభా పది రెట్లు పెరిగి 3 కోట్ల నుండి 30 కోట్లకు చేరింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 1947 నుండి 2017 వరకు, 70 సంవత్సరాలలో భారతదేశంలో ముస్లింల జనాభా పది రెట్లు పెరిగి, 3 కోట్ల నుండి 30 కోట్లకు చేరింది.
ఫాక్ట్(నిజం): 2017 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా 30కోట్లని, 1947 నుండి 2017 వరకు, 70 సంవత్సరాలలో భారతదేశంలో ముస్లింల జనాభా పది రెట్లు పెరిగింది అనే వాదనలో నిజం లేదు. భారతదేశ అధికారిక జనాభా లెక్కల ప్రకారం, 1951 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 3.54 కోట్లు, అలాగే 2011 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 17.22 కోట్లు. అయితే, భారతదేశంలో ముస్లిం జనాభాతో పాటు అన్ని మతాల జనాభా పెరుగుతోంది. మొత్తం భారతదేశ జనాభా కూడా 1951 నుండి 2011 వరకు గణనీయంగా పెరిగింది. 1951 నుండి 2011 మధ్య భారతదేశ మొత్తం జనాభా సుమారు 3.5 రేట్లు పెరిగింది, ఇదే కాలానికి హిందువుల జనాభా సుమారు 3.2 రేట్లు మరియు ముస్లిం జనాభా సుమారు 5 రేట్లు పెరిగింది. అయితే, 1991 నుంచి దేశ జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. అలాగే చాలా మతాల జనాభా వృద్ధి రేటు కూడా తగ్గుతూ వస్తోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అలాగే భారతదేశ విభజన కూడా జరిగింది. భారత్-పాకిస్థాన్ విభజన సందర్భంగా అనేక మంది ప్రజలు ముఖ్యంగా ముస్లింలు భారతదేశం నుండి పాకిస్థాన్‌కు వలస వెళ్ళారు. అలాగే చాలా మంది ప్రజలు పాకిస్థాన్ నుండి భారతదేశానికి వలస వచ్చారు. ఇలా ప్రజలు వలస వెళ్ళడం వలన దేశంలో ఎంత జనాభా ఉంది అని రెండు దేశాలు 1947 లో స్పష్టంగా గుర్తించలేకపోయాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశ జనాభాను గుర్తించేందుకు ప్రభుత్వం 1951లో సెన్సస్(మొదటి జనాభా గణనను) నిర్వహించింది.
1947 మరియు 2020లో ముస్లిం జనాభా ఎంత ఉందో చెప్పడానికి అధికారిక సమాచారం లేనందున, 1951 మరియు 2011 సెన్సస్ సమాచారాన్ని పరిశీలిద్దాం. ఇందుకోసం, మేము భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జనాభా లెక్కల వివరాల కోసం censusindia.gov.in వెబ్‌సైట్‌లో 1951 సెన్సస్ వివరాలను పరిశీలించగా, 1951 సెన్సస్ అధికారిక డేటా ప్రకారం, 1951లో భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 3.54 కోట్లు, అలాగే 1951 నాటికి భారతదేశ జనాభాలో ముస్లిం జనాభా శాతం సుమారు 9.9%గా ఉంది.
అలాగే, 2011 సెన్సస్ అధికారిక డేటా ప్రకారం, అలాగే 2011 నాటికి భారతదేశ జనాభాలో ముస్లిం జనాభా శాతం సుమారు 14.2%గా ఉంది (ఇక్కడ). 2001-2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 17.7 % గా ఉండగా, అదే కాలంలో వివిధ మతల వారీగా జనాభా పెరుగుదల రేటు ఇలా ఉంది, హిందువులు: 16.8%; ముస్లింలు: 24.6%; క్రైస్తవులు: 15.5%; సిక్కు: 8.4%; బౌద్ధులు: 6.1% మరియు జైనులు: 5.4% (ఇక్కడ). అలాగే 2001-2011 దశాబ్దంలో వివిధ మతాల జనాభా పెరుగుదల రేటు తగ్గింది. హిందూ జనాభా వృద్ధి 19.92% నుండి 16.76%కి తగ్గింది, అలాగే ముస్లింల జనాభా వృద్ధి రేటు 29.52% నుండి 24.60%కి తగ్గింది (ఇక్కడ).
ఈ డేటా ప్రకారం, 2001 మరియు 2011 మధ్య భారతదేశ మొత్తం జనాభాలో హిందువుల జనాభా శాతం 0.7 శాతం (percentage point,PP), సిక్కులు 0.2 శాతం, బౌద్ధులు 0.1 శాతం మేర తగ్గింది. అలాగే, మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 0.8 శాతం పెరిగింది. ఈ కాలంలో జనాభాలో క్రైస్తవులు మరియు జైనుల నిష్పత్తి పెద్దగా మారలేదు. వివిధ సెన్సస్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లిం జనాభా శాతం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అయితే, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ముస్లిం జనాభా 2017 నాటికి 30కోట్లకు చేరుకోలేదని, అలాగే 1947 నుండి 2017 మధ్యకాలంలో ముస్లిం జనాభా 10 రేట్లు పెరగలేదని, 1951 నుండి 2011 మధ్య ముస్లిం జనాభా సుమారు 5 రేట్లు పెరిగిందని ఈ డేటా ద్వారా స్పష్టం అవుతుంది. అలాగే 1951 నుండి 2011 మధ్య భారతదేశ మొత్తం జనాభా సుమారు 3.5 రేట్లు పెరిగింది, ఇదే కాలానికి హిందువుల జనాభా సుమారు 3.2 రేట్లు పెరిగింది.
జూలై 2023లో లోక్‌సభలో భారతదేశంలోని ముస్లిం జనాభా గురించి శ్రీమతి మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు, అప్పటి మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ సమాధానమిస్తూ, “2011 సెన్సస్ ప్రకారం, భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 17.22 కోట్లు, భారతదేశ మొత్తం జనాభాలో ముస్లిం జనాభా శాతం సుమారు 14.2%గా ఉందని, జాతీయ జనాభా కమిషన్ అంచనా ప్రకారం జూలై 2023 నాటికి భారతదేశ జనాభా సుమారు 138.82 కోట్లు గా అంచనా వేసింది. 2011 సెన్సస్ ప్రకారం, దేశ జనాభాలో ముస్లిం జనాభా శాతం సుమారు 14.2%గా ఉంది, ఈ నిష్పత్తి ప్రకారం,2023లో ముస్లింల జనాభా 19.75 కోట్లుగా అంచనా వేయబడింది” పేర్కొన్నారు.
ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహా మండలి (EAC-PM) మే 2024లో విడుదల చేసిన “Share of Religious Minorities; A Cross-Country Analysis (1950-2015)” రిపోర్ట్ ప్రకారం, 1950 మరియు 2015 మధ్య భారతదేశ మొత్తం జనాభాలో హిందూ జనాభా వాటా 7.82 శాతం (84.68 శాతం నుండి 78.06 శాతం) మేర తగ్గింది. ముస్లిం జనాభా వాటా 4.25 శాతం (9.84 శాతం నుండి 14.09 శాతానికి) మేర పెరిగింది, క్రైస్తవ జనాభా వాటా 2.24 శాతం నుండి 2.36 శాతానికి పెరిగింది, సిక్కు జనాభా వాటా 1.74 శాతం నుండి 1.85 శాతానికి పెరిగింది, బౌద్ధ జనాభా వాటా 0.05 శాతం నుండి 0.81 శాతానికి పెరిగింది. అలాగే, భారతదేశ జనాభాలో జైనుల వాటా 0.45 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది, పార్సీ జనాభా 0.03 శాతం నుండి 0.004 శాతానికి తగ్గింది.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. భారతదేశంలో ముస్లిం జనాభాతో పాటు చాలా మతాల్లోనూ జనాభా పెరుగుతోంది. మొత్తం భారతదేశ జనాభాయే 1951 నుండి 2011 వరకు గణనీయంగా పెరిగింది. అయితే, 1991 నుంచి దేశ జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. అలాగే చాలా మతాల జనాభా వృద్ధి రేటు కూడా తగ్గుతూ వస్తోంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 గణాంకాల ప్రకారం, మిగతా మతాలతో పోల్చుకుంటే ముస్లింలలో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది. అయితే గత రెండు దశాబ్దాల్లో, ముస్లింలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని డాటా చెబుతోంది. వాస్తవానికి, హిందువుల కన్నా ముస్లింలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ తగ్గుతోంది. 1992లో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉండగా, అది 2019 నాటికి 2.4కి తగ్గింది. అలాగే 1992లో హిందువుల సంతానోత్పత్తి రేటు 3.3గా ఉండగా, అది 2019లో 1.94గా ఉంది.
2050 నాటికి భారతదేశ జనాభాలో సుమారు 18.4 శాతం ముస్లింలు ఉంటారని అమెరికాకు చెందిన ‘Pew Research Center’ 2015లో అంచనా వేసింది (ఇక్కడ).
చివరగా, 2011లో నిర్వహించిన సెన్సస్ ప్రకారం భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 17.22 కోట్లు, మరియు దేశ జనాభాలో ముస్లిం జనాభా శాతం సుమారు 14.2%గా ఉంది. అలాగే 2017 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా 30కోట్లుకు పెరిగింది అనే వాదనలో ఎలాంటి నిజం లేదు.