Fact Check, Fake News, Telugu
 

రైళ్లలో వయోవృద్ధుల రాయితీని జులై 01 నుండి పునరుద్ధరించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించలేదు

0

జులై 1 నుండి రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధులకు టికెట్ ఛార్జీలపై రాయితీని ఇస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ఛార్జీలలో 40%, 58 ఏళ్ల దాటిన మహిళలకు టికెట్ ఛార్జీలలో 50% రాయితీని కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: రైళ్లలో వయో వృద్ధుల రాయితీని 01 జులై 2023 నుండి పునరుద్ధరించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): రైళ్లలో వయో వృద్ధుల రాయితీని పునరుద్ధరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించలేదు. రైళ్లలో వృద్ధుల రాయితీని సంబంధించి 03 ఫిబ్రవరి 2023 నాడు పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ, 2019-20 సంవత్సరంలో ప్రయాణీకుల టిక్కెట్ల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.59,837 కోట్లు ఖర్చు చేసిందని, ఈ విధంగా రైల్వే ప్రయాణీకుల ప్రయాణ వ్యయంలో సగటున 53% రాయితీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భరిస్తుందని తెలిపారు. కానీ, రైళ్లలో వృద్ధుల కోసం ప్రత్యేక రాయితీని పునరుద్దరిస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రుత్వ శాఖ ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించీన వివరాల కోసం సంబంధిత కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, రైళ్లలో వృద్ధుల రాయితీకి పునరుద్దరించడానికి సంబంధించి పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 03 ఫిబ్రవరి 2022 నాడు సమాధానమిచ్చినట్టు తెలిసింది. “స్లీపర్ మరియు 3rd ఏసీలో ప్రయాణించే వృద్ధులకు రాయితీ కల్పించే విషయంపై పరిశీలిన చేయాలని రైల్వే స్టాండింగ్ కమిటీ సూచించింది. 2019-20 సంవత్సరంలో ప్రయాణీకుల టిక్కెట్ల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.59,837 కోట్లు ఖర్చు చేసింది. ఈ విధంగా రైల్వే ప్రయాణీకుల ప్రయాణ వ్యయంలో సగటున 53% రాయితిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భరిస్తుంది. ప్రయాణికులందరికి ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఈ సబ్సిడీతో పాటు రైళ్లలో ప్రయాణించే దివ్యాంగులకు, విధ్యార్ధులకు, రోగులకు ప్రత్యేక రాయితిని కల్పిస్తున్నాము”, అని అశ్విని వైష్ణవ్ తన సమాధానంలో తెలిపారు. రైళ్లలో వృద్ధులకు రాయితిని మళ్ళీ పునరుద్దరిస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ తన సమాధానంలో ఎక్కడా పేర్కొనలేదు.

2020 మార్చి నెలలో కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా రైళ్లలో వృద్ధుల రాయితీతో సహ పలు రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వృద్ధుల రాయితీ ఎత్తివేయక ముందు రైల్వే శాఖ, 58 ఏళ్ల దాటిన మహిళలకు టికెట్ ఛార్జీలలో 50%, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ఛార్జీలలో 40% రాయితీ కల్పించేవారు.

2022 జులై నెలలో వృద్ధుల రాయితీ పునరుద్ధరణకు సంబంధించి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో  సమాధానమిస్తూ, ప్రయాణీకుల రాయితీల వలన ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని, కోవిడ్-19 కారణంగా ప్రయాణికుల టికెట్ల ఆదాయం తగ్గిపోయిందని, వయో వృద్ధులు సహా మొత్తం అన్ని వర్గాలకూ రాయితీలను విస్తరించడం వాంఛనీయం కాదని తెలిపారు. టికెట్ ధర తక్కువగా ఉన్న కారణంగా ప్రయాణ వ్యయంలో సగటున 50 శాతాన్ని రైల్వే శాఖే భరిస్తుందని, ఇలాంటి పరిస్థుతులలో కూడా వైకల్యం ఉన్న వారికి, రోగులకు, విద్యార్థులకు రాయితీలను కొనసాగిస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ అప్పుడు తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2022లో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.

చివరగా, రైళ్లలో వయో వృద్ధుల రాయితీని జులై 01 నుండి పునరుద్ధరించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll