Fake News, Telugu
 

అసలు భారత ప్రభుత్వం త్రివిధ దళ సైనికులకి కూడా అధికారికంగా ‘అమరుల’ హోదా ఇవ్వదు

0

పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు ‘అమరుల’ హోదా ఇవ్వడం సాధ్యపడదని ఢిల్లీ హైకోర్టులో కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 19న అఫిడవిట్‌ను దాఖలు చేసిందని, త్రివిధ రక్షణ దళాలకు చెందిన సిబ్బంది విధి నిర్వహణలో చనిపోతే ఆ సైనికుని కుటుంబానికి ఇచ్చే పెన్షన్ సదుపాయాన్నే విధి నిర్వహణలో మరణించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకి కూడా వర్తింపజేయడం సాధ్యపడదని కేంద్రం ఈ అఫిడవిట్లో చెప్పినట్లు ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు ‘అమరుల’ హోదా ఇవ్వలేమని మరియు ఆయా సైనికుల కుటుంబాలకు పెన్షన్ సదుపాయం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హై కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది.

ఫాక్ట్: విధినిర్వహణలో మరణించిన CAPF సిబ్బందికి కూడా త్రివిధ దళ జవాన్లకు ఇచ్చే విధంగా ‘అమరుల’ హోదా మరియు వారి పూర్తి జీతాన్ని కుటుంబానికి పెన్షన్‌గా ఇవ్వాలని 2015లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సమాధానంగా, అసలు విధినిర్వహణలో మరణించిన ఎటువంటి జవాన్‌కి కూడా ‘అమరుడు’ అనే హోదా ప్రభుత్వం అధికారికంగా కల్పించడానికి ఎటువంటి అధికరణ, చట్టం లేదా నిబంధన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ఈ హోదాని అధికారికంగా ఎవరికీ ఇవ్వదు కాబట్టి, CAPF సిబ్బంది పై వివక్ష చూపుతున్నారనడం సరైనది కాదని 2016లో ఈ కేసులో కొట్టేయడం జరిగింది. 2019లో కూడా ఇదే తరహా కేసు వేసినప్పుడు, మునుపటి తీర్పునకు కట్టుబడి 19 ఫిబ్రవరి 2019లో మళ్ళీ కేసును కొట్టివేశారు. అయితే పుల్వామా దాడిలో మరణించిన CRPF జవాన్ల కుటుంబాలకు పూర్తి పెన్షన్‌తో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలను మరియు పరిహారాన్ని అందించామని హోమ్ వ్యవహారాల శాఖ 2021లో పార్లమెంటుకి తెలిపింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ పోస్టు మార్చి 2019 నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లుగా గుర్తించాము. ఇక పోస్టులో చెప్పిన కేసు వివరాల గురించి వెతకగా, ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ చౌదరి అనే న్యాయవాది 2015లోనే దాఖలు చేసినట్లు గుర్తించాము. Central Armed Police Forces (CAPF) సిబ్బందిని కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికుల వలే గౌరవించాలనీ, మరణించిన CAPF సిబ్బందికి కూడా ‘అమరుల’ హోదా కల్పించడంతో పాటు వారితో సమానంగా ఆర్థిక ప్రయోజనాలను మరియు పరిహారాన్ని అందజేయాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్  వాదిస్తూ, అసలు త్రివిధ దళాలలో కానీ CAPFలో కానీ లేదా ఇతర వాటిలో కానీ విధి నిర్వహణలో మరణించిన వ్యక్తిని ‘అమరుడు’ అని అధికారికంగా గుర్తించడానికి ఎటువంటి అధికరణ, చట్టం, ఆర్డర్, నోటిఫికేషన్ లేదు అని తెలిపారు.

మరణించిన త్రివిధ దళ సైనికులకు ప్రభుత్వం తరపున అధికారికంగా ‘అమరులు’ అనే గుర్తింపు లేనప్పుడు CAPF సిబ్బందిపై ఈ విషయంలో వివక్ష చూపుతున్నారనడం తప్పుడు భావన అని ఆయన స్పష్టం చేశారు.

త్రివిధ దళాలలోని సైనికులైనా లేదా ఇతర సైనికులైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు సామాజికంగా అందరినీ అమరులుగానే భావిస్తారని, వార్తా పత్రికలు, మీడియాలో ఈ పదాన్ని వాటి రిపోర్టింగ్‌ని బట్టి కొందరు వాడచ్చు వాడకపోవచ్చు, అంత మాత్రాన అది అధికారికంగా ప్రకటించినట్లు కాదని సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు.

ఇక మరణించిన CAPF సిబ్బందికి అందవలసిన ఆర్థిక సహాయం, పరిహారాల గురించి చెప్తూ, 7వ పే కమిషన్ చేసిన సిఫార్సులను అమలులోకి తీసుకురావాలా వద్ద అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని, హోమ్ మంత్రిత్వ శాఖ దీనిని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్తూ అసలు ఈ పిటిషన్ తప్పుడు అవగాహనతో వేసినదిగా నిర్ధారించి 18 అక్టోబర్ 2016లో కోర్టు దీన్ని కొట్టేసింది.

ఇక 2019లో మళ్ళీ ఇదే తరహా రిట్ పిటిషన్‌ని దాఖలు చేయగా, పైన చెప్పిన తీర్పుని ఆధారంగా 19 ఫిబ్రవరి 2019లో ఈ కేసుని ఢిల్లీ హైకోర్టు కూడా కొట్టివేసింది.

ఇక ‘అమరులు’ అనేది త్రివిధ దళాల్లో వాడరని పార్లమెంటులో పలు సార్లు రక్షణ శాఖ జవాబిచ్చింది.

ఇక పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన 40 మంది CRPF(CAPF లో ఒక విభాగం) జవాన్ల కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం చేశారో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు హోమ్ వ్యవహారాల శాఖ జవాబిస్తూ, వారికి అందిన ఆర్థిక పరిహారాల వివరాలని మరియు ఇతర ప్రయోజనాలని వెల్లడించింది. వీరి కుటుంబాలకి ఆయా జవాన్లు తీసుకుంటున్న జీతాలనే పెన్షన్లుగా ఇవ్వడం జరుగుతుందని కూడా స్పష్టం చేసింది.

చివరిగా, అసలు ‘అమరులు’ హోదాను భారత ప్రభుత్వం త్రివిధ దళ జవాన్లకు కానీ CAPF లేదా ఇతర సైనికులకు కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించదు.

Share.

About Author

Comments are closed.

scroll