Fake News, Telugu
 

దేశంలో మైనారిటీల జనాభా 30 శాతానికి పెరిగింది అని పెట్టిన పోస్ట్ తప్పు

0

దేశంలో మైనారిటీల మీద దాడులు జరగుతే, 1947 లో ఏడు శాతం ఉన్న మైనారిటీల జనాభా 2020 నాటికి 30 శాతంకి ఎలా పెరిగింది అని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క  ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1947 లో ఏడు శాతం ఉన్న మైనారిటీల జనాభా 2020 నాటికి 30 శాతానికి పెరిగింది.

ఫాక్ట్ (నిజం): 1947 మరియు 2020 లో మైనారిటీల జనాభా ఎంత ఉందో చెప్పడానికి అధికారిక సమాచారం లేదు. 1951 సెన్సస్ ప్రకారం 15.02 శాతం ఉన్న మైనారిటీల జనాభా 2011 నాటికి 19.65 శాతానికి పెరిగినట్టు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేసిన ‘Handbook on Social Welfare Statistics-2018’ డాక్యుమెంట్లో చూడవొచ్చు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.    

భారతదేశంలో ఆరు మతాలను మైనారిటీలుగా భారత ప్రభుత్వం నోటిఫై చేసిందని, వారి జనాభా 19 శాతానికి పైగా ఉన్నట్టు ప్రభుత్వం వారి ‘వికాస్ పీడియా’ వెబ్సైటులో చూడవొచ్చు. ఇదే విషయాన్నీ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి ‘2018-19 వార్షిక నివేదిక’ లో కూడా చూడవొచ్చు.

1947 మరియు 2020 లో మైనారిటీల జనాభా ఎంత ఉందో చెప్పడానికి అధికారిక సమాచారం లేదు. కావున, 1951 మరియు 2011 సెన్సస్ సమాచారాన్ని పరిశీలిద్దాం. 1951 మరియు 2011 లో మైనారిటీల జనాభా వివరాలు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ (సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ) వారు రిలీజ్ చేసిన ‘Hand Book on Social Welfare statistics-2018’ డాక్యుమెంట్లో చూడవొచ్చు. 1951 లో 15.02 శాతం ఉన్న మైనారిటీల జనాభా 2011 నాటికి 19.65 శాతంకి పెరిగినట్టు తెలుస్తుంది.

స్వాతంత్రం తరువాత పాకిస్థాన్ భారత దేశం నుండి విడిపోయి, ఈస్ట్ పాకిస్థాన్ మరియు వెస్ట్ పాకిస్థాన్ గా తమ సొంత దేశం ఏర్పర్చుకుంది. అనేక మంది ముస్లింలు పాకిస్థాన్ దేశానికి వలస వెళ్ళిపోయారు, అలాగే ఎంతో మంది ప్రజలు భారత దేశానికి వలస వచ్చారు. ఇలా ప్రజలు వలస వెళ్ళడం వలన దేశంలో ఎంత జనాభా ఉంది అని రెండు దేశాలు 1947 లో స్పష్టంగా గుర్తించలేక పోయాయి. స్వతంత్ర భారత దేశంలో జనాభా గుర్తించేందుకు ప్రభుత్వం మొట్టమొదటి సారిగా 1951లో సెన్సస్ నిర్వహించింది. కావున 1947లో మైనారిటీ ప్రజల జనాభా ఏడు శాతం ఉన్నారు అని చేస్తున్న క్లెయిమ్ కి ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేదు.

చివరగా, భారత దేశం 2011 లో నిర్వహించిన సెన్సస్ ప్రకారం మైనారిటీల జనాభా 19.65 శాతం. పోస్ట్ లో చెప్పినట్టు 2020 నాటికి మైనారిటీ జనాభా 30 శాతం కి పెరిగినట్టు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll