Fake News, Telugu
 

2014లో పాకిస్తాన్ లో తప్పిపోయిన బాలుడి ఫోటోని తప్పుడు కథనంతో ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు

0

ఒక బాలుడు తప్పిపోయి 45 రోజుల నుండి రాజస్థాన్ రాష్ట్రం గంగానగర్ పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ  ఫోటోని ఇతరులకి షేర్ చేసి ఈ బాలుడు తన తల్లిదండ్రులని చేరుకునేలా సాయం చేయమని ఆ ఫోటో కింద అభ్యర్థిస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: 45 రోజుల నుండి గంగానగర్ పోలీస్ స్టేషన్ లో ఉంటున్న తప్పిపోయిన బాలుడి ఫోటో. 

ఫాక్ట్ (FACT): వైరల్ అవుతున్న ఫోటో సోషల్ మీడియాలో 2015 నుండే షేర్ అవుతోంది. తప్పిపోయిన బాలుడు రాజస్తాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని శ్రీ గంగానగర్ జిల్లా పోలీస్ స్టేషన్, అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ కూడా వివరణ ఇచ్చారు. పాకిస్థాన్ లోని చార్ సద్దా  జిల్లాకి చెందిన ఈ బాలుడు 6 జూన్ 2014లో తప్పిపోయాడు. 2015లో కొంతమంది ఇదే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మక్కా, ఖోర్రంధార  మరియు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఈ బాలున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

తప్పిపోయాడని వైరల్ అవుతున్న బాలుడి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటో 2015 నుండే సోషల్ మీడియాలో షేర్ అవుతూ కనిపించింది. దానికి సంబంధించిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్టులలో కూడా ఈ బాలుడు తన ఇంటినుండి తప్పిపోయి, 45 రోజుల నుండి గంగానగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఫోటో గురించి మరింత సమాచారం కోసం వెతకగా ఫరా ఖాన్ అనే ఒక జర్నలిస్ట్ ఇదే బాలుడి ఫోటోని 2016లో ట్వీట్ చేసి ఏడేళ్ల బాలుడు, రెండు సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుండి తప్పిపోయి భారతదేశంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కనుగొనబడ్డాడని పేర్కొంది. 

పైన లభించిన సమాచారంతో ఇంటర్నెట్ లో వెతకగా పాకిస్తాన్ కి చెందిన ‘DAWN’ అనే ఒక న్యూస్ వెబ్సైటులో 29 మే 2016న ప్రచురించిన ఈ బాలుడి ఫోటోతో కూడిన ఒక కథనం లభించింది. ఈ కథనం ప్రకారం ఫోటోలో ఉన్న బాలుడి పేరు తుఫాయిల్ ఇస్మాయిల్, చార్ సద్దాకి చెందిన ఇతడు ఐదేళ్లు ఉన్నపుడు వాళ్ళ కుటుంబం సర్దర్యాబ్ నుండి టెర్నాబ్ కి ఇల్లు మారుతున్నప్పుడు తప్పిపోయినట్టు తెలిసింది. 6 జూన్ 2014న తప్పిపోయిన ఇతడు రెండు సంవత్సరాల తరువాత భారత్ లోని రాజస్థాన్ రాష్ట్రంలో గంగా నగర్  పోలీస్ కస్టడీలో ఉన్నట్టు ఈ కథనం పేర్కొంది. ఇదే విషయాన్ని 30 మే 2016న భారత దేశంలోని ఇతర న్యూస్ వెబ్సైటులు కూడా ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

సోషల్ మీడియాలోని పోస్టులు చూసి రాజస్థాన్ లోని గంగానగర్ పోలీస్ స్టేషన్ లో తమ కొడుకు ఉన్నాడని నమ్మిన బాలుడి తల్లిదండ్రులు తనని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాలని అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అస్ఫంద్యార్ వాలీ ఖాన్ కూడా బాలుడిని వెంటనే పాకిస్తాన్ కి రప్పించడానికి అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాసారు. 

కానీ గంగానగర్ జిల్లా పోలీసులు మాత్రం తాము పాకిస్తాన్ కి చెందిన బాలుడిని కస్టడీలోకి తీసుకున్నట్టు వస్తున్న వార్తలని ఖండించారు. శ్రీ గంగానగర్ పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ కాటకే 30 మే 2016న మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ కి చెందిన ఆ బాలుడు గంగానగర్ జిల్లా పోలీసుల కస్టడీలో లేడని, ఇవి కేవలం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పుకార్లు అని పేర్కొన్నారు. అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా ఫోటోలో ఉన్న అబ్బాయి గంగానగర్ లో లేడని ట్వీట్ చేసారు.

2015లో కొంతమంది ఇదే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతను మక్కా, ఖోర్రంధరా మరియు ఇతర పోలీసు స్టేషన్ ల కస్టడీలో ఉన్నట్టు షేర్ చేసారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఇదే విషయం పై వివరణ ఇస్తూ ఖోర్రంధరా పోలీసులు సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలలో నిజం లేదని, తాము బాలున్ని కస్టడీలోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ బాలుడు ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియకపోయినా, తను గంగానగర్ పోలీసుల కస్టడీలో లేడని నిర్ధారించవచ్చు. 

చివరగా, 2014లో పాకిస్తాన్ లో తప్పిపోయిన బాలుడి ఫోటోని తప్పుడు కథనంతో ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll