Fake News, Telugu
 

‘2041 లో భారతదేశంలో 84.5 శాతం ముస్లింలే ఉంటారు’ అని వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదు

0

2041 లో భారతదేశంలో 84.5 శాతం ముస్లింలు ఉంటారు అని అంచనా వేస్తూ ‘The Institute of World Demographics Research’ వారు ఒక సూచిక విడుదల చేసినట్టు చెప్తూ ఒక లింక్ తో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2041 లో భారతదేశంలో 84.5 శాతం ముస్లింలే ఉంటారని అంచనా వేసిన ‘The Institute of World Demographics Research’.

ఫాక్ట్ (నిజం): ‘The Institute of World Demographics Research’ పేరుతో అంతర్జాతీయ సంస్థ ఉన్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. పోస్టులో ఇచ్చిన ‘Pew Research Center’ వారి ఆర్టికల్ లింక్ లో కూడా 2041 లో భారతదేశంలో 84.5 శాతం ముస్లింలే ఉంటారని ఎక్కడా కూడా లేదు. ‘Pew Research Center’ వారి అంచనా ప్రకారం, 2050 లో భారత్ లో సుమారు 18.4 శాతం మాత్రమే ముస్లింలు ఉంటారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని అంకెలను ‘The Institute of World Demographics Research’ సంస్థ వారు విడుదల చేసినట్టు ఉంది. కావున, ఆ సంస్థ గురించి గూగుల్ లో వెతకగా, ఆ పేరుతో అంతర్జాతీయ సంస్థ ఉన్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. పోస్టులో ‘Pew  Research Center’ వారి ఆర్టికల్ లింక్ ఉంది. ఆ ఆర్టికల్ చదవగా, 2050 లో భారత్ లో సుమారు 18.4 శాతం మాత్రమే ముస్లింలు ఉంటారని ‘Pew  Research Center’ వారు అంచనా వేసినట్టు తెలుస్తుంది. 2050 నాటికి ఎక్కువ మంది ముస్లింలు మరియు హిందువులు ఉన్న దేశంగా భారత్ ఉంటుంది అని ఆ ఆర్టికల్ లో ఉంటుంది. అంతేకానీ, భారత్ ముస్లిం దేశంగా మారుతుందని ఉండదు. ‘Pew Research Center’ వారి ‘The Future of World Religions: Population Growth Projections, 2010-2050’ యొక్క పూర్తి రిపోర్ట్ ని ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, పోస్టులో ఇచ్చిన మిగిలిన అంకెల్లో కూడా తప్పులు ఉన్నాయి. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో 14.2 శాతం ముస్లింలు ఉంటే, పోస్టులో మాత్రం అధికారిక డేటా ప్రకారం 2011 లో భారతదేశంలో 22.6 శాతం ముస్లింలు ఉన్నట్టు తప్పుగా రాసారు.

చివరగా, ‘2041 లో భారతదేశంలో 84.5 శాతం ముస్లింలే ఉంటారు’ అని వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll