Fake News, Telugu
 

బ్రెజిల్ లో 2018లో జరిగిన ఒక హత్యకి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్ లో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింస నేపథ్యంలో ఒక వ్యక్తిని రాళ్ళు, గొడ్డల్లతో కొట్టి చంపిన వీడియోని బెంగాల్ దాడులకి సంబంధించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన దాడులకి సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2018 లో బ్రెజిల్ లోని సియారా రాష్ట్ర రాజధాని అయిన ఫోర్టాలెజాలో ఒక యువకుడిని రాళ్ళు, గొడ్డల్లతో కొట్టి చంపిన ఘటనకి సంబంధించింది. ఈ హత్యకి LGBTQ ఫోబియా కారణమై ఉండొచ్చని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ వీడియోకి పశ్చిమ బెంగాల్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే స్క్రీన్ షాట్స్ ని 2018లో ప్రచురించిన కొన్ని బ్రెజిలియన్ వార్తా కథనాలు మాకు లభించాయి. అలాంటి ఒక కథనం ప్రకారం ఈ ఫోటో బ్రెజిల్ లోని సియారా రాష్ట్ర రాజధాని అయిన ఫోర్టాలెజాలో కొంత మంది 17 ఏళ్ల ఒక యువకుడిని గొడ్డలి మరియు రాళ్లతో కొట్టి చంపిన సంఘటనకు సంబంధించింది.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరొక వార్తా కథనం ప్రకారం బ్రెజిల్‌లోని సియారాలో జరిగిన ఈ ఘటనకి LGBTQ ఫోబియా కారణమై ఉండొచ్చని పేర్కొంది. సియారా రాష్ట్రానికి చెందిన సివిల్ పోలీసులు మరణించిన వ్యక్తిని వెస్లీ టియాగో డి సౌసా కార్వాల్హో (17)గా గుర్తించినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. పైగా పోలీసులు ఈ హత్యకు LGBTQ ఫోబియా కారణం కాదని అభిప్రాయ పడ్డట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. ఐతే ఈ హత్య వెనుక ఉద్దేశం కచ్చితంగా తెలియకపోయినా, పైన పేర్కొన్న రెండు కథనాలు ఆధారంగా ఈ వీడియోకి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇటీవల 02 మే 2021న వెలువడ్డ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

చివరగా, బ్రెజిల్ లో జరిగిన ఒక హత్యకి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్ లో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll