తెలంగాణ ప్రభుత్వం వారి రంజాన్ గిఫ్ట్ కిట్ ఫోటోని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి లాక్ డౌన్ లో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం పండుగకి గిఫ్ట్ లు ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: లాక్ డౌన్ లో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకి ఇస్తున్న రంజాన్ గిఫ్ట్ కిట్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటో పాతది. ఆ ఫోటో ఇంటర్నెట్ లో కనీసం జులై 2015 నుంచి ఉంది. అంతేకాక, ముఖ్య మంత్రి కెసిఆర్ కూడా COVID-19 సంక్షోభం వలన ఈ సంవత్సరం రంజాన్ గిఫ్ట్ కిట్లను ఇవ్వట్లేదని స్పష్టం చేసారు. కావున, ఆ క్లెయిమ్ తప్పు.
పోస్ట్ లోని ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఆ ఫోటో పాతది అని తెలిసింది. ఆ ఫోటో ఇంటర్నెట్‌లో కనీసం జూలై 2015 నుండి ఉంది. అదే ఫోటోను ఒక ఫేస్‌బుక్ యూజర్ కూడా 2015 లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను 2018 లో ‘సాక్షి పోస్ట్’ ప్రచురించిన కథనంలో కూడా చూడవచ్చు. కావున, ఆ ఫోటో ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలోని రంజాన్ మాసానికి సంబంధించినది కాదు.
అంతేకాక, 5 మే 2020 న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్య మంత్రి, కెసిఆర్ కూడా COVID-19 సంక్షోభం వలన ఈ సంవత్సరం రంజాన్ గిఫ్ట్ కిట్లను ఇవ్వట్లేదని స్పష్టం చేసారు, ఎందుకంటే వాటిని పంపిణీ చేయడం వల్ల చేతులు చేతులు మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు. అదే విషయాన్ని, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో లో 1:40:00 దగ్గర చూడవచ్చు. అంతేకాక, తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు ‘బతుకమ్మ’కి చీరలు, క్రిస్మస్ కి గిఫ్ట్ ప్యాక్ లు ఇవ్వడం జరిగింది.
చివరగా, ఒక పాత ఫోటోను పెట్టి లాక్ డౌన్ సమయం లో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇస్తున్న రంజాన్ గిఫ్ట్ కిట్ అని తప్పు ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?