Fact Check, Fake News, Telugu
 

ఒకే ఎన్నికలో రెండు చోట్ల నుండి ఓటు వేయడం చట్టవిరుద్ధం. కానీ, రెండు వేరు వేరు ఎన్నికల్లో వేరు వేరు చోట్ల ఓటు వేసే అవకాశం ఉంది

0

గత ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల లో ఓటు వేస్తే, ఎంఎల్‌సీ కవిత నిజామాబాద్ లో ఓటు వేసిందని, ఇప్పుడు తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరూ హైదరాబాద్ లో ఎలా ఓటు వేయగలిగారని ప్రశ్నిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఉండి, చట్టవిరుద్ధంగా రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అసలు రెండ చోట్ల ఓటు వేయోచ్చా? అది చట్టవిరుద్ధమా? అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

2018 అసెంబ్లీ మరియు 2019 లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడ ఓటు వేసాడు?

కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలో సిరిసిల్ల లో ఓటు వేసాడని చెప్తూ, ఒక ఫోటోని (ఆర్కైవ్డ్) సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

అయితే, ఆ ఫోటో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీసిన ఫోటో కాదు; 2019 లోక్ సభ ఎన్నికల్లో తన ఓటును కేటీఆర్ బంజారా హిల్స్ లోని నందినగర్‌ పోలింగ్ బూత్ లో వేసినప్పుడు తీసిన ఫోటో అది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ నందినగర్‌ లోనే ఓటు వేసాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ బంజారా హిల్ లోని ఒక స్కూల్ లో ఓటు వేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. కావున, 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ, మరియు 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ హైదరాబాద్ లోనే ఓటు వేసాడు.

2019 లో నిజామాబాద్ లో ఓటు వేసిన కవిత ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఓటు వేసింది? రెండు చోట్ల ఓటు వేయొచ్చా?

2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఇక్కడ చూడవొచ్చు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తను హైదరాబాద్ లో ఓటు వేసింది. ఒకే ఎన్నికలో రెండు చోట్ల నుండి ఓటు వేయడం చట్టవిరుద్ధం. కానీ, తను రెండు వేరు వేరు ఎన్నికల్లో వేరు వేరు చోట్ల ఓటు వేసింది. ఒక ఎన్నికలో ఒక చోట నుండి ఓటు వేసాక, మరో ఎన్నికలో ఇతర చోటికి తన ఓటు మార్పించుకొని ఎవరైనా ఓటు వేయొచ్చు. ఒక నియోజికవర్గం నుండి మరో నియోజికవర్గం కి ఓటు మార్పించుకోవాలంటే ఎవరైనా ‘Form 6’ నింపవొచ్చు.

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌ గ్రామ పరిధిలో తనకు, తన భర్తకు ఉన్న ఓటు హక్కును ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలని ఎమ్మెల్సీ కవిత అక్కడి ఈఆర్‌వోకు దరఖాస్తు చేసుకున్నారని, నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ పూర్తయిందని, దీంతో కవిత హైదరాబాద్‌లో ఓటు వేశారు” అని టీఆర్‌ఎస్‌ నేతలు తెలిపినట్టు ఆంధ్రజ్యోతి ఆర్టికల్ లో చదవొచ్చు. “తమకు ఖైరాతాబాద్‌ ఈఆర్‌వో నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పొతంగల్‌ ఉన్న కవిత ఓటును ఎన్నికల కమిషన్‌ జాబితా నుంచి తొలగించామని. నేషనల్‌ సర్వీసు ఓటర్ల లిస్టులో వారం రోజుల తర్వాత తొలగిస్తారని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ వెల్లడించారు” అని అదే ఆర్టికల్ లో చదవొచ్చు. ఎన్నికల కమిషన్ వెబ్సైటులో ఇంకా అప్డేట్ కానందున ఒకే ‘EPIC’ నెంబర్ తో రెండు చోట్ల ఓటు ఉన్నట్టు చూపిస్తున్నట్టు చూడవొచ్చు. చట్టవిరుద్ధంగా రెండు చోట్ల ఓట్లు ఉంటే, రెండు వేరు వేరు ‘EPIC’ నెంబర్లు ఉంటాయి. కానీ, రెండిట్లో ఒకే ‘EPIC’ నెంబర్ ఉన్నట్టు గమనించవొచ్చు.

ఎంఎల్ఏ గా పోటీ చేసే నియోజికవర్గం లోనే అభ్యర్థికి ఓటు ఉండాలా?

సిరసిల్ల ఎంఎల్ఏ అయిన కేటీఆర్ కి హైదరబాద్ లో ఓటు ఎలా ఉంది అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంఎల్ఏ గా పోటీ చేయాలంటే ఆ నియోజికవర్గం లోనే అభ్యర్థికి ఓటు ఉండాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు ఉంటే చాలని ‘Representation of the People Act, 1951’ లో చూడవొచ్చు. కావున, సిరసిల్ల లో ఎంఎల్ఏ అవ్వడానికి కేటీఆర్ కి సిరసిల్ల లో ఓటు ఉండాల్సిన అవసరం లేదు.

ఒక నియోజికవర్గంలో ఓటు హక్కు రావాలంటే ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి నివసిస్తుండాలి (‘ordinarily resident of the part/polling area of the constituency where you want to be enrolled’). కానీ, కొంత మంది అధికారులకు ఇంకా ప్రజా ప్రతినిధులకు ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 20 ప్రకారం మినహాయింపు ఉంది. అంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నివసించకున్నా కూడా, వారు అక్కడ ఓటు హక్కు కోసం ‘Form 1’ నింపవొచ్చు.

చివరగా, ఒకే ఎన్నికలో రెండు చోట్ల నుండి ఓటు వేయడం చట్టవిరుద్ధం. కానీ, రెండు వేరు వేరు ఎన్నికల్లో వేరు వేరు చోట్ల ఓటు వేసే అవకాశం ఉంది. ఓటుని బదిలీ చేయించుకొని వెయ్యొచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll