తెలుగు దేశం పార్టీ నేత రాజేష్ సరిపెల్ల మహిళలను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే వార్త ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిందని చెప్తూ, ఒక పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇదే పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా NTV కూడా ఈ వార్తని ప్రసారం చేసిందని చెప్తూ మరొక వీడియో కూడా ప్రచారంలో ఉంది. వీటిలో ఎంత నిజమో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: TDP నేత రాజేష్ సరిపెల్ల మహిళలను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆంధ్రప్రభ, NTVలో వచ్చిన వార్తా కథనాలు.
ఫాక్ట్: ఆంధ్రప్రభ పత్రిక ఈ వార్తని ప్రచురించలేదు. ఇది ఆ పత్రిక పేరుతో చలామణీ అవుతున్న నకిలీ పేపర్ క్లిప్పింగ్. NTV లో కూడా ఇటువంటి కథనం ప్రసారం కాలేదు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఆంధ్రప్రభ పత్రిక వారు ఇటువంటి వార్తని ఇటీవల ఎప్పుడైనా ప్రచురించారా అని వారి వెబ్‌సైట్ మరియు ఈ-పేపర్లను వెతకగా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇదే విషయాన్ని ఇతర పత్రికలు ప్రచురించినట్లు కూడా మాకు ఆధారాలు దొరకలేదు. అయితే వైరల్ పేపర్ క్లిప్పింగ్‌లో పైభాగంలో ఉన్న రెండు లైన్‌లను ఆధారంగా, ఆంధ్రప్రభ ఈ- పేపర్లో వెతకగా, ఆ సమాచారం 30 ఆగస్టు 2023 ఆంధ్ర ప్రభ విజయవాడ ఎడిషన్లో రెండవ పేజీలో వచ్చినట్లు గుర్తించాము. ఈ రెండు లైన్లు “ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో సిట్‌పై స్టే” అనే హెడ్ లైన్‌తో ఉన్న కథనానికి సంబంధించినవి. కానీ, ఆ పేజీలో ఇదే ఆఖరి కథనం.
వైరల్ పేపర్ క్లిప్పింగ్‌లో ఉన్నట్లుగా ఈ కథనం కింద కానీ మరో పేజీలో కానీ రాజేష్‌కి సంబంధించిన వార్త ఏదీ రాలేదు. దీన్ని బట్టి వైరల్ పేపర్ క్లిప్పింగ్ ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితం కాలేదని, అది ఎడిట్ చేసినదని నిర్ధారించవచ్చు.
ఇక NTV వారు ఈ పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా ఏదైనా వీడియోని ప్రసారం చేసారా అని NTV యూట్యూబ్ ఛానెల్ మరియు ఇతర సోషల్ మీడియా ఖాతాలలో వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. పైగా వీడియోలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ రాజేష్ పేరుని కానీ అతనికి సంబంధించిన మరే ఇతర వివరాలను కానీ వెల్లడించలేదు. దీన్ని బట్టి ఒక పాత NTV వీడియోలో వైరల్ అవుతున్న పేపర్ క్లిప్పింగ్‌ని జోడించి ఉండవచ్చునని చెప్పవచ్చు. అయితే, తనపై కొందరు ఆకతాయిలు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన అన్నారు. మహిళల అక్రమ రవాణా చేసినట్లు ఆధారాలు చూపిస్తే ఎటువంటి శిక్షకైనా తాను సిద్ధమేనని రాజేష్ పేర్కొన్నారు.
చివరిగా, TDP నేత రాజేష్ సరిపెల్ల విదేశాలకు మహిళలను అక్రమ రవాణా చేస్తున్నాడని ప్రచారంలో ఉన్న ఆంధ్రప్రభ మరియు NTV వార్తా కథనాలు నకిలీవి.