ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మని దహనం చేస్తుండగా కొందరు కాంగ్రెస్ సభ్యుల లుంగీలకి మంటలు అంటుకున్నాయి అని, ఈ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది అని చెప్తూ, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ (ఇక్కడ, ఇక్కడ) అవుతోంది, దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల కర్ణాటకలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ఐదుగురు కాంగ్రెస్ సభ్యుల దుస్తులకి మంటలు అంటుకున్నప్పుడు చిత్రించిన వీడియో ఇది.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 2012 నాటిది, ఇప్పటిది కాదు. 2012లో కొందరు కేరళ స్టూడెంట్స్ యూనియన్(KSU) విద్యార్థులు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మను, పఠనంతిట్ట అనే ప్రదేశంలో కాలుస్తున్నప్పుడు జరిగిన సంఘటనకు చెందిన వీడియో ఇది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కొన్ని కీ ఫ్రేమ్స్ తీసి, వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు ఉన్న 2012 నాటి ఒక ఫేస్‌బుక్ వీడియో (ఆర్కైవ్ లింక్) దొరికింది. ఆ వీడియో టైటిల్ ‘Funny Incident During Protest In Kerala. Lungi Catches Fire…’ అంటే, దాదాపు 12 సంవత్సరాల క్రితం నాటి వీడియోని ఇప్పటిది అని చెప్పి వైరల్ చేస్తున్నారు అని అర్థమవుతుంది.
ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, జూలై 2012 నాటి ‘ఏషియానెట్ న్యూస్’ వారి ఒక వార్తా కథనం(ఆర్కైవ్ లింక్) దొరికింది.

ఈ కథనం ప్రకారం కేరళలోని పఠనంతిట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొందరు కేరళ స్టూడెంట్స్ యూనియన్(KSU) విద్యార్థులు చేపడుతున్న ఒక నిరసనలో భాగంగా, MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మని దహనం చేస్తుండగా, కొందరి దుస్తులకి నిప్పు అంటుకుంది. ఇదే సంఘటన యొక్క ప్రస్తావన, 2012 నాటి ఒక వార్తా కథనంలో కూడా ఉంది.

అదనంగా, ఇటీవల కర్ణాటకలో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని మేము ఇంటర్నెట్‌లో వెతకగా, మాకు ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు.
చివరిగా, 2012లో కేరళలో జరిగిన ఒక సంఘటనకి చెందిన వీడియోని ఇటీవల కర్ణాటకలో కొందరు కాంగ్రెస్ సభ్యులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మని తగల పెడుతుండగా వారి దుస్తులకి మంటలు అంటుకున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.