అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం వల్ల కలిగే అనారోగ్యం గురించి వివరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ మరియు ఇక్కడ). అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం, అలాగే అల్యూమినియం ఫాయిల్స్ వాడడం ద్వారా అల్జీమర్స్, తల నొప్పి వంటి వ్యాధులు వస్తాయని, కాబట్టి వీటిని వాడడం మానేయాలని ఈ వీడియోలో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం, అలాగే అల్యూమినియం ఫాయిల్స్ వాడడం ద్వారా అల్జీమర్స్, తల నొప్పి వంటి వ్యాధులు వస్తున్నాయి.
ఫాక్ట్(నిజం): అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం ద్వారా మనిషి శరీరంలోకి అల్యూమినియం చేరుతుందని పరిశోధనలో తేలినప్పటికీ, ఇది మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అల్యూమినియం పరిమితికి లోబడి ఉంటే అల్జీమర్స్, మొదలైన వ్యాధులు వచ్చే ఆస్కారం తక్కువ. FAO, WHO మరియు యూరోపీయన్ ఏజెన్సీ కూడా ఇదే చెప్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం ద్వారా వేడికి కొంత అల్యూమినియం ఆహారంలో కలిసి పోతుందని పరిశోధనలో తేలినప్పటికీ, ఇది మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో ఉండదు. పైగా చాలా శాతం వరకు ఈ అల్యూమినియం కిడ్నీల ద్వారా బయటి వెళ్ళిపోతుంది.
అల్యూమినియం తీసుకోవడం వల్ల అల్జీమర్స్, డెమెన్షియా, మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నప్పటికీ, ఎక్కువ స్థాయిలో అల్యూమినియం తీసుకుంటేనే ఇలా జరుగుతుందని తేలింది. సాధారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారా ప్రవేశించే అల్యూమినియం ప్రమాదకర స్థాయిలో ఉండదని, ఈ మోతాదు వల్ల అల్జీమర్స్, మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం లేదని శాత్రవేత్తలు తెలిపారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).
FAO మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కూడా ఈ అంశంపై పరిశోధనలు చేసి పరిమితి లోబడి తీసుకుంటే అల్యూమినియం వల్ల పెద్దగా హాని ఉండదని తెలిపింది. ఐరోపాలో కూడా ఈ అంశంపై అధ్యయనం చేసి అక్కడి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆహారం ద్వారా మనలోపలికి చేరే అల్యూమినియం మోతాదు ఎంత లోపు ఉండాలో అన్న సమాచారాన్ని స్పష్టం చేసింది (ఇక్కడ).
మన దేశంలో కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు సంబంధించి వాడే అల్యూమినియం ఫాయిల్‌కు సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ నిర్దారించి, వాటి ఉపయోగానికి అనుమతి ఇచ్చింది. దీన్నిబట్టి మనం తీసుకునే ఆహారం వల్ల మనలోపలికి చేరే అల్యూమినియం పరిమితికి లోబడి ఉంటే పెద్దగా ఇబ్బందులు కలగవని స్పష్టమవుతుంది.
ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చెప్తున్నట్టు అల్యూమినియం పాత్రలు వాడడం హానికరం అని చెప్తూ పలు వార్తా కథనాలు ప్రచురించేసరికి ఈ వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతుంది. కాగా ప్రభుత్వ పోర్టల్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రచురించినప్పటికీ, దీనికి సంబంధించి అదనపు సమాచారం ఏది అందించలేదు. కానీ అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం పరిమితికి లోబడి ఉంటే అల్యూమినియం వల్ల అల్జీమర్స్, మొదలైన వ్యాధులు వచ్చే ఆస్కారం తక్కువ.
చివరగా, ఆహార పదార్థాల ద్వారా తీసుకునే అల్యూమినియం పరిమితికి లోబడి ఉంటే వ్యాధులు వచ్చే ఆస్కారం తక్కువ.