Fake News, Telugu
 

ఆస్ట్రేలియాలో ఉన్న ఒక రహదారి ఫోటోని ఆదిలాబాద్‌లోని అటవీ ప్రాంతం రోడ్ ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక అందమైన రహదారి దృశ్యాన్ని చూపిస్తున్న ఫోటో అని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈ ఫోటో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న రహదారిని చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్న రోడ్డు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో లేదు, ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలో ఉన్న రహదారికి చెందిన ఫోటో. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తనిఖీ చేయడానికి మేము వైరల్ ఫోటోను ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వార Flickr, Imgur మరియు Shutterstock వంటి అనేక స్టాక్ ఫోటో వెబ్‌సైట్‌లలో ఉన్న ఇదే ఫోటో మాకు దొరికింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోడ్డు ఉందన్న వైరల్ క్లెయిమ్‌కి విరుద్ధంగా, వైరల్ ఫోటోలో ఉన్న రోడ్ ఆస్ట్రేలియాలో ఉంది అని ఈ స్టాక్ ఫోటోల ద్వారా మనకు అర్థం అవుతుంది. 

Flickrలో ఉన్న ఈ ఫోటోని 12 జూన్ 2024న సిడ్నీకి చెందిన ‘ఇసాబెల్’ అనే ఫోటోగ్రాఫర్ అప్‌లోడ్ చేశారు. ఈ ఫోటో యొక్క క్యాప్షన్ ప్రకారం ఈ రోడ్డు కంగారు ద్వీపంలో ఉంది. కంగారూ ద్వీపం ఆస్ట్రేలియాలో ఉంది.

ఈ ఫోటోపై ఉన్న మెటాడేటా ప్రకారం దీన్ని ఆస్ట్రేలియాలోని సౌత్ ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్లిండర్స్ చేజ్(నేషనల్ పార్క్)లో తీశారు. దీని బట్టి వైరల్ ఫోటో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని రహదారిని చూపించడం లేదు అని స్పష్టం అవుతోంది. 

ఈ విషయం గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా, ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలో ఉన్న ఇలాంటి రోడ్ యొక్క అనేక ఫోటోలు కొన్ని స్టాక్ ఫోటో వెబ్‌సైట్‌లలో మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఫోటోలు వైరల్ అవుతున్న ఫోటోను పోలి ఉన్నాయి.

ఇవే కాక, ఈ రోడ్డుకు సంబంధించి మాకు కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ మరియు ఇక్కడ), 2020 నాటి ‘ది ఆస్ట్రేలియన్’ వార్తా పత్రిక యొక్క Facebook పోస్ట్‌ దొరికాయి. 2020లో ఆస్ట్రేలియాలో చలరేగిన అడవి మంటలు కంగారూ ద్వీపంలో సృష్టించిన వినాశనాన్ని ఈ కథనాలు చూపిస్తున్నాయి. ‘ABC’ వారి కథనం ప్రకారం, ఈ ఫోటోలో కనిపిస్తున్నది కంగారూ ద్వీపంలో ఉన్న కేప్ డు కౌడిక్ రోడ్.

అదనంగా, ఈ రోడ్డు ఉన్న  ఫ్లిండర్స్ చేజ్ నేషనల్ పార్క్‌లోని ఒక రహదారిని కొంతమంది వ్లాగర్లు డాక్యుమెంట్ చేసారు, ఈ వీడియోలలో ఉన్న రోడ్డు, వైరల్ ఫోటోలో ఉన్న రోడ్ లాగనే కనిపిస్తుంది. మీరు ఈ వ్లాగర్‌లు అప్‌లోడ్ చేసిన YouTube వీడియోలని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఆస్ట్రేలియాలోని ఒక రహదారి ఫోటోని తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన అటవీ రోడ్డు ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll