Fake News, Telugu
 

వైరల్ వీడియో తమిళనాడులోని తెన్‌కాశిలో ఉన్న పొట్టల్‌పుదూర్ దర్గాను చూపుతుంది; ఈ దర్గా ఒకప్పుడు హిందూ దేవాలయం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు

0

తమిళనాడులోని తెన్‌కాశిలో ఉన్న పురాతన హిందూ దేవాలయాన్ని ఇటీవల ప్రభుత్వ సహకారంతో మసీదుగా మార్చారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో మనం హిందూ దేవాలయం లాంటి నిర్మాణాన్ని చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళనాడులోని తెన్‌కాశిలో ఉన్న ఓ పురాతన హిందూ దేవాలయాన్ని ఇటీవల అక్కడి ప్రభుత్వ సహకారంతో మసీదుగా మార్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా తెన్‌కాశిలో ఉన్న పొట్టల్‌పుదూర్ దర్గాను చూపుతుంది. గతంలో ఈ దర్గా హిందూ దేవాలయం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. తమిళనాడు టూరిజం వెబ్‌సైట్‌ ప్రకారం, ఈ దర్గా 17వ శతాబ్దంలో (క్రీ.శ. 1674) ఇస్లామిక్ పండితుడు మొహిదీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ జ్ఞాపకార్థం నిర్మించబడింది. పొట్టల్‌పుదూర్ దర్గా నిర్మాణం ఇస్లామిక్ మరియు ద్రవిడ శైలుల సమ్మేళనం, విభిన్న సంస్కృతుల సామరస్య సహజీవనాన్ని ప్రతిబింబిస్తుంది. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో అనేక మసీదులు ద్రవిడ శిల్పకళను ఉపయోగించి నిర్మించబడ్డాయి. వాటిలో తమిళనాడులోని రామనాథపురం జిల్లా కిలకరైలో ఉన్న జుమ్మా పాలి (కీజకరై మసీదు) చెప్పుకోదగిన ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే, తమిళనాడు ప్రభుత్వ అధికారిక ఫాక్ట్-చెకింగ్ సంస్థ తమ అధికారిక X (ట్విట్టర్)లో ఈ వైరల్ పోస్ట్‌లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, తమిళనాడులోని తెన్‌కాశీలోని పురాతన హిందూ దేవాలయం ఇటీవల మసీదుగా మార్చబడిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే వైరల్ వీడియోను ఇదే క్లెయింతో వేరొకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, తమిళనాడు ప్రభుత్వ అధికారిక ఫాక్ట్-చెకింగ్ సంస్థ దీనిపై తమ అధికారిక X (ట్విట్టర్)లో స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్) వైరల్ పోస్ట్‌లో నిజం లేదని పేర్కొంది. అలాగే ఈ పోస్టులో “ఈ వీడియో వాస్తవానికి తిరునెల్వేలిలోని తెన్‌కాశిలో ఉన్న పొట్టల్‌పుదూర్ మొహైదీన్ అందవర్ దర్గాను చూపిస్తుందని, ఈ దర్గా 17వ శతాబ్దంలో (క్రీ.శ. 1674) ఇస్లామిక్ పండితుడు మొహిదీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ జ్ఞాపకార్థం నిర్మించబడింది మరియు ఈ దర్గా ద్రవిడ శిల్పకళ యొక్క వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, ఈ దర్గాను హిందువులు మరియు క్రైస్తవులు కూడా ఎక్కువగా సందర్శిస్తారు” అని పేర్కొన్నారు.

ఈ మసీదుకు గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, గూగుల్‌లో వెతకగా, తమిళనాడు ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్‌లో దీని గురించి సమాచారం లభించింది. తమిళనాడు ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్‌ ప్రకారం, పొట్టల్‌పుదూర్ దర్గా తమిళనాడులోని ఒక  ప్రసిద్ధ ఇస్లామిక్ పుణ్యక్షేత్రం. ఈ దర్గా కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; ఇది సాంస్కృతిక మరియు సామాజిక కార్యకలాపాలకు కేంద్రం. ఈ మసీదు తమిళనాడు యొక్క గొప్ప నిర్మాణ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మించబడింది, కళ మరియు వాస్తుశిల్పాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ దీనిని తప్పక చూడవలసినదిగా చేస్తుంది. పొట్టల్‌పుదూర్ దర్గా యొక్క నిర్మాణం ఇస్లామిక్ మరియు ద్రవిడ శైలుల సమ్మేళనం, విభిన్న సంస్కృతుల సామరస్య సహజీవనాన్ని ప్రతిబింబిస్తుంది. గోడలపై ఉన్న క్లిష్టమైన శిల్పాలు, నిర్మలమైన వాతావరణం మరియు ప్రార్థనల సున్నితమైన లయ సందర్శకులను ప్రశాంతతను కలిగిస్తాయి. సూఫీ సన్యాసి, హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షా,  ప్రేమ, కరుణ మరియు ఐక్యత యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తూ యెమెన్ నుండి పొట్టల్‌పుదూర్‌కు వచ్చినట్లు చెబుతారు. హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షా నేతృత్వంలో సూఫీ సాధువులు, ఇరాన్ నుండి భారతదేశానికి ప్రయాణిస్తున్న సమయంలో, పొట్టల్‌పుదూర్ గ్రామానికి చేరుకుని, ప్రజలకు ఇస్లాంను బోధిస్తూ అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నారని. సూఫీ పెద్ద హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షా మరణించిన తరువాత, ప్రజలు 1674 సంవత్సరంలో హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షా కోసం ఒక సమాధిని నిర్మించారు, అప్పటి నుండి మసీదులో పూజించబడుతోంది. పొట్టల్‌పుదూర్ దర్గా యొక్క ప్రత్యేకత వార్షిక ఉర్స్ ఉత్సవం. ఉర్స్ అనేది సూఫీ సెయింట్ యొక్క వర్ధంతిని సూచిస్తుంది మరియు ఈ దర్గాలో గొప్ప ఆనందంతో జరుపుకుంటారు, ఖవ్వాలి ప్రదర్శనలు (సంగీత ప్రదర్శనలు) కూడా పండుగలో ముఖ్యమైన భాగం. ఈ దర్గా ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు మరియు క్రైస్తవులు కూడా సందర్శిస్తారు.  

తమిళనాడు ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్‌లో ఈ మసీదు పూర్వం హిందూ దేవాలయం అని ఎక్కడా పేర్కొన్నబడలేదు. అలాగే ఈ మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయం అని చెప్పే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు. ఈ క్రమంలోనే పొట్టలపుదూర్ దర్గా ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన మద్రాసు హైకోర్టులో ఒక కేసు నమోదు అయినట్లు మేము గుర్తించాము. ఈ కేసు విచారణలో, ఈ దర్గా పురాతనమైనదని, దీనిని 1674లో నిర్మించారని, ఈ మసీదును ముస్లింలు మాత్రమే కాకుండా హిందూ, క్రైస్తవ భక్తులు కూడా సందర్శిస్తారని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశంలో చాలా పురాతన మసీదులు ద్రవిడ శైలిలో ఇస్లామిక్ భావాలతో రాతితో నిర్మించబడ్డాయి. డైరెక్టర్ అఫ్ మ్యూజియమ్స్, ప్రభుత్వ మ్యూజియం చెన్నై ద్వారా ప్రచురించబడిన Dr. రాజా మహమ్మద్ రచించిన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇన్ తమిళనాడు అనే పుస్తకంలో హిందూ దేవాలయాలను పోలి ఉండే ద్రవిడ శైలిలో నిర్మించిన వివిధ మసీదులు మరియు దర్గాలను గురించి వివరించారు. వాటిలో తమిళనాడులోని రామనాథపురం జిల్లా కిలకరైలో ఉన్న జుమ్మా పాలి (కీజకరై మసీదు) చెప్పుకోదగిన ఉదాహరణగా నిలుస్తుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హిందూ దేవాలయాలను పోలి ఉండే వివిధ మసీదులను ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇంతకుముందు కూడా తమిళనాడులోని జుమ్మా పల్లి మసీదు మరియు కర్ణాటకలోని మంగళూరులోని జీనత్ బక్ష్ మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయాలు అంటూ పలు పోస్టులు వైరల్ కాగా, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు .

చివరగా, వైరల్ వీడియో తమిళనాడులోని తెన్‌కాశిలో ఉన్న పొట్టల్‌పుదూర్ దర్గాను చూపుతుంది మరియు ఈ దర్గా ఒకప్పుడు హిందూ దేవాలయం అనే వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll