Fake News, Telugu
 

రాజస్థాన్‌కు సంబంధించిన పాత ఫోటోని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బీజేపీ నాయకుడిని ప్రజలు కొట్టిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అడగడానికి వెళ్ళిన ఒక బీజేపీ నాయకుడిని ప్రజలు చొక్కా చినిగేలా కొట్టి తరిమికొడుతున్న దృశ్యం అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఈ ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్నట్టు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో భాగంగా ఓట్లు అడగడానికి వెళ్ళిన బీజేపీ నాయకుడిని ప్రజలు చొక్కా చినిగేలా కొట్టి తరిమేస్తున్న దృశ్యం.

ఫాక్ట్: 2021 జూలై నెలలో రాజస్తాన్ బీజేపి నాయకుడు కైలాష్ మేఘ్వాల్‌పై రైతు నిరసనకారులు చేసిన దాడి దృశ్యాలని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం శ్రీ గంగానగర్‌లో చోటుచేసుకుంది. పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘ఆజ్ తక్’ వార్తా సంస్థ 30 జూలై 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో దొరికింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్‌లో చోటుచేసుకున్నట్టు ఆర్టికల్‌లో తెలిపారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరుగుదల మరియు నీటిపారుదల సమస్యలకు సంబంధించి రాజస్తాన్ బీజేపీ 30 జూలై 2021 నాడు శ్రీ గంగానగర్‌లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గోనడానికి వెళ్ళిన బీజేపీ నాయకుడు కైలాష్ మేఘ్వాల్‌పై వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు దాడికి పాల్పడినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ దాడికి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల ప్రచారాలకి వెళ్ళిన బీజేపీ నాయకులని ప్రజలు తరిమికొడుతున్న దృశ్యాలని ఇటీవల సోషల్ మీడియాలో పాత ఫోటోలని, వీడియోలని షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ వాటికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, రాజస్థాన్‌కు సంబంధించిన పాత ఫోటోని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బీజేపీ నాయకుడిని ప్రజలు చొక్కా చినిగేలా కొట్టి తరిమికోడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll