Fake News, Telugu
 

ఈ విడియోలోని ఘటన ఇద్దరు ఉత్తరప్రదేశ్‌ బీజేపీ నాయకుల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించినది

0

అప్డేట్ (14 మే 2024): 2024 లోకసభ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న బిజేపి నాయకుల వాహనాలని స్థానికులు అడ్డుకొని ధ్వంసం చేస్తున్నారంటూ ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే, క్రింది ఆర్టికల్లో నిర్ధారించినట్లుగా ఈ వీడియో 2021లో ఆగ్రాలో జరిగిన ఇద్దరు బీజేపీ నాయకుల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించినది.

ఉత్తరప్రదేశ్‌లో ఎలక్షన్ ప్రచారానికి వెళ్లిన బీజేపీకి అక్కడి ప్రజలు మీరు వద్దంటూ ఇలా విరుచుకుపడ్డారంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో ఎలక్షన్ ప్రచారానికి వెళ్లిన బీజేపీపై విరుచుకుపడిన అక్కడి ప్రజల వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో ఇద్దరు బీజేపీ నాయకుల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించినది. ఆగ్రాలోని బాహ్ అసెంబ్లీ నియోజికవర్గంలో మాజీ మంత్రి అరిదమన్ సింగ్, మాజీ బ్లాక్ ప్రముఖ్ సుగ్రివ్ సింగ్ చౌహాన్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇదంతా బాహ్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ టికెట్ పొందడానికి సంబంధించి జరిగిన ఘర్షణగా న్యూస్ రిపోర్ట్స్ లో తెలిపారు. సుగ్రివ్ సింగ్ చౌహాన్ బంధువు భోలారామ్, అరిదమన్ సింగ్ మరియు 345 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.    

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో లభించింది. ఆగ్రాలో మాజీ మంత్రి అరిదమన్ సింగ్, మాజీ బ్లాక్ ప్రముఖ్ సుగ్రివ్ సింగ్ చౌహాన్ సహచరులు ర్యాలీ మధ్యలో ఘర్షణపడ్డారు. ఆగ్రాలోని ఇద్దరు ముఖ్యమైన బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో సుగ్రివ్ సింగ్ చౌహాన్ కు సంబంధించిన అర డజన్ పైగా బండ్లు దెబ్బతిన్నాయని వీడియో వివరణలో తెలిపారు.

కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్లో వెతకగా, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని న్యూస్ రిపోర్ట్స్ లభించాయి. ఆగ్రాలోని బాహ్ అసెంబ్లీ నియోజికవర్గంలో మాజీ మంత్రి అరిదమన్ సింగ్, మాజీ బ్లాక్ చీఫ్ సుగ్రివ్ సింగ్ చౌహాన్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇద్దరి మద్దతుదారులు ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వారు. ఈ అలజడిలో అరడజనుకు పైగా వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ పోలీసు దళం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసారు.

ఇదంతా బాహ్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ టికెట్ పొందడానికి సంబంధించి జరిగిన ఘర్షణ. టికెట్ కోసం మాజీ మంత్రి, మాజీ బ్లాక్ చీఫ్ మధ్య ఆధిపత్య యుద్ధం కొంతకాలంగా నడుస్తుంది. అసెంబ్లీ నియోజికవర్గంలో ప్రత్యర్థులకు తన బలాన్ని చూపించడానికి, అరిదమన్ సింగ్ తన మద్దతుదారులతో పినాహట్ పట్టణం నుండి ర్యాలీని తీసారు. కానీ నందగావా వద్ద అరిదమన్ సింగ్, సుగ్రీవ్ సింగ్ మద్దతుదారులు ముఖాముఖి రావటంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

అదే రోజు, 07 డిసెంబర్ 2021న, ఘటనా స్థలానికి (పినాహట్ పోలీస్ స్టేషన్ ఏరియా) చేరుకున్న ఆగ్రా ఎస్పీ, వీడియోలు మరియు దొరికిన సాక్షాల ప్రకారం చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు.  

సుగ్రివ్ సింగ్ చౌహాన్ బంధువు భోలారామ్, అరిదమన్ సింగ్ మరియు 345పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేసు నమోదైంది.

చివరగా, ఇద్దరు బీజేపీ నాయకుల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణను ఉత్తరప్రదేశ్‌ ఎలక్షన్ ప్రచారానికి వెళ్లిన బీజేపీపై విరుచుకుపడిన ప్రజల వీడియో అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll