Fake News, Telugu
 

జన్ ధన్ యోజన కింద నగదు పొందవచ్చని స్క్రాచ్ కార్డ్‌లు షేర్ చేస్తున్న ఈ వెబ్‌సైట్‌ మోసపూరితమైంది

0

జన్ ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరి ఖాతాలో ఉచితంగా ₹5000 అందిస్తున్నారంటూ ప్రధానమంత్రి చిత్రంతో కూడిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. స్క్రాచ్ కార్డ్‌ల ద్వారా ఈ డబ్బులు పొందవచ్చని కొన్ని లింకులను ఈ పోస్టుల ద్వారా అందిస్తున్నారు. ఈ కథనం ద్వారా షేర్ అవుతున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రభుత్వం జన్ ధన్ యోజన కింద స్క్రాచ్ కార్డ్‌ల ద్వారా ₹5000 అందిస్తుంది.

ఫాక్ట్(నిజం): ప్రభుత్వం ప్రత్యేకంగా జన్ ధన్ అకౌంట్లలోకి ₹5000 అందిస్తుందన్న వార్తలో నిజంలేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా స్క్రాచ్ కార్డ్‌ల ద్వారా నగదు బదిలీ చేయదు. సాధారణంగా ఏదైనా అధికారిక వెబ్‌సైట్ లింక్ లేదా URLలో ‘.gov.in’ కలిగి ఉంటాయి. అలాగే ‘https’తో మొదలవుతాయి. కానీ ఇప్పుడు షేర్ అవుతున్న లింక్‌లో అవేమి లేకపోవడం గమనించొచ్చు. దీన్నిబట్టి ఇది ఒక మోసపూరిత వెబ్‌సైట్‌ అని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా జన్ ధన్ యోజన అనేది దేశంలోని ప్రజలందరినీ ఆర్ధిక రంగంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన స్కీం. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో అందరికీ జీరో బ్యాలన్స్ బ్యాంక్ అకౌంట్లను అందిస్తారు. ప్రభుత్వం తరపునుండి జరిగే నగదు బదిలీ, పెన్షన్లు, ఈ అకౌంట్లకు రూపే క్రెడిట్ కార్డులు అందించడం, మొదలైన సేవలు ఈ అకౌంట్ల ద్వారా పొందవచ్చు. అంతేగానీ ప్రత్యేకంగా ఈ అకౌంట్లలోకి ప్రభుత్వం ప్రతీ ఒక్కరికి ₹5000 అందిస్తుందన్న వార్తలో నిజంలేదు.

ఇక ఈ స్క్రాచ్ కార్డ్‌ల విషయానికి వస్తే ప్రభుత్వం ఎప్పుడూ ఇలా స్క్రాచ్ కార్డ్‌ల ద్వారా నగదు బదిలీ చేయదు. సాధారణంగా ఈ ప్రకటనపై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారులను స్క్రాచ్ కార్డ్‌ను కలిగి ఉన్న మోసపూరిత వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ తరవాత ఏదైనా UPI ఆప్‌కు డైరెక్ట్ చేసి PIN నెంబర్ అడుగుతారు. ఇలా చేయడం ద్వారా ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసపూరిత లింకులను క్లిక్ చేయకపోవడం శ్రేయస్కరం.

సాధారణంగా ఏదైనా అధికారిక వెబ్‌సైట్ లింక్ లేదా URLలో ‘.gov.in’ కలిగి ఉంటాయి. అలాగే ‘https’తో మొదలవుతాయి. కానీ ఇప్పుడు షేర్ అవుతున్న లింక్‌లో అవేమి లేకపోవడం గమనించొచ్చు. దీన్నిబట్టి ఇది ఒక మోసపూరిత వెబ్‌సైట్‌ అని స్పష్టమవుతుంది.

గతంలో పలు సందర్భాల్లో పోలీసులు కూడా నేరస్తులు ఇలా స్క్రాచ్ కార్డ్‌ల ద్వారా ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు (ఇక్కడ & ఇక్కడ). FACTLY ఇలాంటి మోసపూరిత వెబ్‌సైట్‌లకు సంబంధించి గతంలో పలు సార్లు రాసిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, జన్ ధన్ యోజన కింద నగదు పొందవచ్చని స్క్రాచ్ కార్డ్‌లు షేర్ చేస్తున్న ఈ వెబ్‌సైట్‌ ఒక మోసపూరితమైంది.

Share.

About Author

Comments are closed.

scroll