Fake News, Telugu
 

బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి కోకాపేటలో భూమి కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయమని తెలంగాణ హైకోర్ట్ అదేశించలేదు.

0

బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నిర్మాణం కోసం గత ప్రభుత్వం హైదరబాద్‌లోని కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై, అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి గత ప్రభుత్వం హైదరబాద్‌లోని కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై, అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిపైనా కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

ఫాక్ట్(నిజం): మే 2023లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరబాద్‌లోని కోకాపేటలో బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి 11 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కేటాయింపు అక్రమమని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) జూలై 2023లో హైకోర్టులో  ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింది. ఇది ఇలా ఉండగా, ఇదే విషయంపై 13 జనవరి 2024న హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL)  దాఖలు అయింది. ఇప్పటికే ఫోరంఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) పిల్‌ దాఖలు చేసినందున మరియు ఆ పిటిషన్‌ విచారణలో ఉన్న కారణంగా ప్రస్తుత పిటిషన్‌కు హైకోర్ట్ రిజిస్ర్టీ నెంబర్‌ కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే 25 జనవరి 2024న రెండో పిటిషన్‌ పై విచారణ చేపట్టిన హైకోర్ట్ ధర్మాసనం, ప్రస్తుత పిటిషన్‌కు రెగ్యులర్‌ నెంబర్‌ ఇవ్వాలని రిజిస్ర్టీకి ఆదేశాలు జారీ చేసింది, FGG దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మే 2023లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరబాద్‌లోని కోకాపేటలో బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ నేపథ్యంలోనే, వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని కేవలం రూ. 37.53 కోట్లకు బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి తక్కువ ధర కేటాయించడం అక్రమమని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  జూలై 2023లో హైకోర్టులో  ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేసింది, వెంటనే అక్కడి నిర్మాణ పనులు జరగకుండా స్టే ఇవ్వాలని కోరింది

18 జులై 2023న విచారణ చేపట్టిన అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అభినంద్ కుమార్ షావిలి మరియు జస్టిస్ ఎన్ రాజేశ్వర్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు బీ.ఆర్‌.ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను 16 ఆగస్టు 2023కు వాయిదా వేసింది ఈ లోగా నోటిసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ PIL పెండింగ్‌లో ఉంది.

ఇది ఇలా ఉండగా, బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నిర్మాణం కోసం కోకాపేటలో 11 ఎకరాల భూమిని తక్కువ ధర కేటాయించడం అక్రమమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎ. వెంకట్రామిరెడ్డి 13 జనవరి 2024న హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL)  దాఖలు చేశారు. ఇప్పటికే ఫోరంఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ (FGG) ఈ వ్యవహారంపై పిల్‌ దాఖలు చేసినందున మరియు ఆ పిటిషన్‌  విచారణలో ఉన్న కారణంగా ప్రస్తుత పిటిషన్‌కు హైకోర్ట్ రిజిస్ర్టీ నెంబర్‌ కేటాయించలేదు. అలాగే హైకోర్ట్ రిజిస్ట్రీ ఈ పిల్‌లో కొన్నిఅభ్యంతరాలను లేవనెత్తింది.

ఈ నేపథ్యంలోనే 25 జనవరి 2024న రెండో పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ 11 ఎకరాల భూకేటాయింపు అంశం ఒక్కటే అయినా తమ పిటిషన్‌లో విస్తృత అంశాలు ఉన్నాయని, హైకోర్ట్ రిజిస్ట్రీకి ఉన్న అభ్యంతరాలను పిటిషనర్ క్లియర్ చేసినట్టు నివేదించారు. దీంతో ప్రస్తుత పిటిషన్‌కు రెగ్యులర్‌ నెంబర్‌ ఇవ్వాలని ధర్మాసనం రిజిస్ర్టీకి ఆదేశాలు జారీ చేసింది. FGG దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు హైకోర్ట్ రిజిస్ట్రీ రెండో PIL కు W.P.(PIL)(sr).No.565 of 2024 అనే నెంబర్ కేటాయించిది.. దీన్ని బట్టి, కేవలం ప్రస్తుత పిటిషన్‌కి నెంబర్ కేటాయించాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చింది అని నిర్థారించవచ్చు.

చివరగా, బీ.ఆర్‌.ఎస్‌ పార్టీకి కోకాపేటలో భూమి కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయమని తెలంగాణ హైకోర్ట్ అదేశించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll