Fake News, Telugu
 

బీజేపీ నాయకుడికి ప్రజలు చెప్పుల దండ వేస్తున్న ఈ పాత వీడియో ఉత్తరప్రదేశ్‌కి సంబంధించింది కాదు.

0

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బీజేపీ నాయకుడికి అక్కడి ప్రజలు చెప్పుల దండ వేసి తరిమికొడుతున్న దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బీజేపీ నాయకుడికి అక్కడి ప్రజలు చెప్పుల దండ వేసి తరిమికొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2018లో మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి దినేష్ శర్మ అనే బీజేపీ నాయకుడిని అక్కడి ప్రజలు ఇలా చెప్పుల దండ వేసి స్వాగతం పలికారు. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న ఫోటోని ‘Scroll.in’ వార్తా సంస్థ 08 జనవరి 2018 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ నగరం సమీపంలోని ధంనోడ్ పట్టణంలో చోటుచేసుకుందని ఆర్టికల్‌లో తెలిపారు. బీజేపీ తరుపున స్థానిక ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన దినేష్ శర్మకి ఒక వ్యక్తి చప్పుల దండ వేసి స్వాగతం పలికినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. నీటి సమస్య గురించి తాము చేసిన అనేక ఫిర్యాదులకి ప్రభుత్వ అధికారులు సరిగా స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఆ వ్యక్తి దినేష్ శర్మకు చెప్పుల దండ వేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

2018లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, ఇదే వీడియోని బీహార్ శాసనసభ ఎన్నికలకు జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోని ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బీజేపీ నాయకుడికి ప్రజలు చెప్పుల దండ వేసి తరిమికోడుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll