Fake News, Telugu
 

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించడం లేదన్న వార్తల్లో నిజం లేదని ఈసీ అప్పట్లోనే స్పష్టం చేసింది.

0

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMలు) విశ్వసనీయతకి సంబంధించి, 50 శాతం VVPATలను EVM ఫలితాలతో సరిపోల్చాలనే డిమాండ్‌కు ECI ప్రతిఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధీనంలోని 20 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయని అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధీనంలోని 20 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయి.

ఫాక్ట్(నిజం): ఈ క్లెయిమ్‌కి సంబంధించి అప్పటి భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) అధికారిక ప్రతినిధి షేఫాలీ శరణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 2019లో వివరణ ఇచ్చారు. 20 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయన్న వాదనలో వాస్తవం లేదని ఆమె అన్నారు. అందువల్ల పోస్ట్‌లో చేసిన దావా తప్పు .

ముందుగా వైరల్ క్లెయిమ్‌కి సంబంధించిన వార్తల కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వార్తలకు మూలం ‘ఫ్రంట్‌లైన్’ మ్యాగజైన్ “మిస్సింగ్ EVMలు” అనే శీర్షికతో 2019లో ప్రచురించిన కథనమని తెలిసింది. ముంబైకు చెందిన ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్ రాయ్ ఆర్టీఐ ద్వారా తాను పొందిన సమాచారం ఆధారంగా బాంబే హైకోర్టులో 20 లక్షల EVMలు ఎన్నికల సంఘం ఆధీనం నుండి తప్పిపోయాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు, ఈ సమాచారం ఆధారంగానే ఈ కథనం ప్రచురించినట్టు ‘ఫ్రంట్‌లైన్’ మ్యాగజైన్ పేర్కొన్నది.

‘ఫ్రంట్‌లైన్’  కథనం ఆధారంగా ది లాజికల్ ఇండియన్ & ది వైర్ వంటి ఇతర మీడియా సంస్థలు కూడా ఇదే అంశంపై కథనాలు ప్రచురించాయి. 2019లో ఈ కథనాలు వైరల్ కావడంతో,  అప్పటి ఈసీఐ అధికారిక ప్రతినిధి షెఫాలీ శరణ్ ఈ విషయంపై తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో వివరణ ఇచ్చారు. ఆమె ట్వీట్ చేస్తూ, “20 లక్షల EVMలు కనిపించడం లేదు” అనే వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ వార్త కథనాలు అన్నీ అనేక పబ్లిక్ అథారిటీల నుండి RTI ద్వారా పొందబడిన పాక్షిక, అసంపూర్ణమైన వివరణలపై ఆధారపడి రిపోర్ట్ చేయబడ్డాయి. రిపోర్టింగ్‌లో అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించాలని మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు అని కోరుతూ ఫ్రంట్‌లైన్ మరియు TV9Bharatvarsh లకు రాసిన లేఖలను కూడా ఆమె ట్వీట్ చేసింది .టీవీ9 ఈ అంశంపై తమ కథనాన్ని తొలగించిందని, ఫ్రంట్‌లైన్ తగిన రీజాయిండర్‌ను ప్రచురిస్తామని తెలిపినట్టు ఆమె తన ట్వీట్ ద్వారా తెలిపింది.

చివరగా, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించడం లేదన్న వార్తల్లో నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll