Fake News, Telugu
 

జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబం ఇస్లామిక్ వంశానికి చెందింది అంటూ చిట్టిబాబు అనే వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవు

0

నెహ్రు ఫ్యామిలీ పై చిట్టిబాబు… ”, అని చెప్తూ చిట్టిబాబు అనే వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబపై వివిధ ఆరోపణలు చేస్తున్న వీడియోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియోలో నెహ్రూ కుటుంబంపై చిట్టిబాబు చేసిన వివిధ ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నెహ్రూ కుటుంబం ఇస్లామిక్ వంశానికి చెందింది; ఇందిరా గాంధీ భర్త కూడా ఒక ముస్లిం.

ఫాక్ట్: వీడియోలో నెహ్రూ కుటుంబపై చిట్టిబాబు చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకముందు ఇవే ఆరోపణలు ఎం.ఓ.మథాయ్ తన ఆత్మకథలో రాసినట్టు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఎం.ఓ.మథాయ్ తన పుస్తకాలలో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియోలో నెహ్రూ కుటుంబపై చిట్టిబాబు వివిధ ఆరోపణలు చేసాడు. వాటిలో కొన్ని  ఆరోపణలకు సంబంధించి అసలు విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

జవహర్‌లాల్ నెహ్రూ అసలు తండ్రి మోతిలాల్ నెహ్రూ కాదా?

భారత పార్లమెంట్ డిజిటల్ లైబ్రరీ వెబ్సైటులో ఉన్న పుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూ తల్లిదండ్రుల పేర్లు స్వరూప్ రాణి , మోతిలాల్ నెహ్రూ అని చూడవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో, జవహర్‌లాల్ నెహ్రూ 1889 లో మోతీలాల్ మరియు స్వరూప్ రాణి తుసు దంపతులకు జన్మించినట్లు చూడవచ్చు. అలాగే, నెహ్రూ యొక్క ఆత్మకథలో (టువర్డ్ ఫ్రీడమ్)  తల్లిదండ్రుల పేర్లు ‘పండిట్ మోతీలాల్ నెహ్రూ’ మరియు ‘స్వరూప్ రాణి నెహ్రూ’గా ఇవ్వబడ్డాయి (పుస్తకం యొక్క ఆర్కైవ్ చేసిన టెక్స్ట్ వెర్షన్ ఇక్కడ చదవవచ్చు).

జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో తన పూర్వీకుడు రాజ్ కౌల్ తన కుటుంబ శ్రేణికి ‘నెహ్రూ’ (నహర్ నుండి, ఒక కాలువ) అనే పేరు పెట్టారు అని రాశారు. రాజ్ కౌల్ కూడా ముస్లిం కాదని, జవహర్‌లాల్ నెహ్రూ యొక్క తాత పేర్లలో ‘పండిట్’ మరియు ‘నెహ్రూ’ ఉన్నాయని గమనించాలి. జవహర్‌లాల్ నెహ్రూ తాత పేరు ‘పండిట్ గంగా ధార్ నెహ్రూ’. అంతేకాదు, నెహ్రూ తన యొక్క ఆత్మకథలో, తన కుటుంబం 1857 తిరుగుబాటు తరువాత కాశ్మీర్‌కు కాకుండా ఆగ్రాకు వలస వెళ్లిందని రాశారు.

ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ ఖాన్ మరియు అతనొక ముస్లిం?

ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ ఖాన్ కాదు, అతని పేరు ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచి 1952 మరియు 1957 లో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసాడు. పార్లమెంట్ సభ్యుల లిస్టులో కూడా అతని పేరు ఫిరోజ్ గాంధీ అనే ఉంది.

ప్రముఖ చరిత్రకారుడు రామ్ చంద్ర గుహ తన పుస్తకం “ఇండియా ఆఫ్టర్ గాంధీ”లో ఫిరోజ్ గాంధీ ఒక పార్సీ అని తెలిపాడు. “ఫిరోజ్ గాంధీ కూడా నెహ్రూ సొంత పట్టణమైన అలహాబాద్ కు చెందినవాడు. అతను ఒక పార్సీ, మొదట తన ఇంటిపేరు ‘ఘండీ’ (Ghandy) అని ఉండేది. అయితే, యువకుడిగా జాతీయోద్యమంలో చేరిన తరువాత, మహాత్మా గాంధీ కి అనుగుణంగా స్పెల్లింగ్ ను మార్చాడు”, అని తెలిసింది.

తాను అనుకోకుండా హిందువుగా పుట్టానని జవహర్‌లాల్ నెహ్రూ అన్నాడా?

ఆ వ్యాఖ్య చేసింది నెహ్రూ కాదు. మొదటిసారి ఆ వ్యాఖ్యలు చేసింది ఎన్.బి.ఖారె అనే ఒక హిందూ మహా సభ నాయకుడు; ఆయన 1959 లో తాను రాసిన ‘The Angry Aristocrat’ ఆర్టికల్లో, నెహ్రూ తన ఆత్మకథలో ఆ వ్యాఖ్యలు చేసాడు అని రాసాడు. కానీ, నెహ్రూ ఆత్మకథలో అలాంటి వ్యాఖ్యలు ఏవీ కనిపించలేదు. ‘Deccan Chronicle’ పత్రిక కూడా ఆ కోట్‌ను తాము నెహ్రూకు తప్పుగా ఆపాదించామని ఒక సవరణని విడుదల చేసింది. అది ఎన్.బి.ఖారె చేసిన ఆరోపణ అని వారు అందులో పేర్కొన్నారు.

అంతేకాక, కాంగ్రెస్ నాయకుడు, శశి థరూర్ కూడా తాను నెహ్రూ గురించి రాసిన పుస్తకం ‘Nehru: The Invention of India’ లో ఆ కోట్ గురించి ప్రస్తావిస్తూ అది నెహ్రూని కించ పరచడానికి ఎన్.బి.ఖారె చేసిన తప్పుడు ఆరోపణ అని, కానీ అది నెహ్రూకి నిజమైన నివాళి అని పేర్కొన్నాడు.

ఇంతకముందు నెహ్రూ కుటుంబపై ఇవే ఆరోపణలు ఎం.ఓ.మథాయ్ తన ఆత్మకథలో రాసినట్టు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఎం.ఓ.మథాయ్ తన పుస్తకాలలో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. ఈ విషయాలపై  FACTLY ఇంతకుముందు మరింత వివరంగా రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు. అంతేకాదు, పోస్ట్‌లోని వీడియోలో చెప్పిన మైనారిటీల లెక్కలు కూడా తప్పే. ఆ లెక్కలకి సంబంధించి ఇంతకముందు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

చివరగా, జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబం ఇస్లామిక్ వంశానికి చెందింది అంటూ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll