గాంధీ బొమ్మ మన కరెన్సీ నోటు మీద ముద్రించడం మొదలుపెట్టినప్పడి నుండి మన కరెన్సీ విలువ పడిపోవడం మొదలయింది అని చెప్తూ ఉండే పోస్ట్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గాంధీ బొమ్మ మన కరెన్సీ నోటు మీద ముద్రించడం మొదలుపెట్టినప్పడి నుండి మన కరెన్సీ విలువ పడిపోవడం మొదలయింది.
ఫాక్ట్ (నిజం): కరెన్సీ నోటుపై గాంధీ ఫోటో ముద్రించకముందు కూడా రూపాయి విలువ క్రమంగా తగ్గుతూనే ఉంది. 1947లో రూపాయి విలువను పౌండ్ ఆధారంగా నిర్ణయించారు. అప్పుడు, ఒక పౌండ్ కి 13.33 రూపాయలు. అదే సమయంలో ఒక డాలర్ కి 3.31 రూపాయలు. 1987 లో మొదటిసారి గాంధీ ఫోటో కరెన్సీ నోటుపై ముద్రించే సమయానికి రూపాయి మారకం విలువ ఒక డాలర్ కి 12.9552 రూపాయలు అయింది. అయినా, రూపాయి విలువ అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్బాలలో ఆర్ధిక వ్యవస్థని సరిచేయడానికి కావాలనే కరెన్సీ విలువని తగిస్తూ ఉంటారు. గాంధీ ఫోటో ముద్రించడం మొదలు పెట్టినప్పటినుండి రూపాయి విలువ తగ్గిందన్న వాదనలో హేతుబద్ధత లేదు. కావున పోస్టులో చెప్తున్నది తప్పు.
15 ఆగస్ట్ 1947లో రూపాయి విలువను పౌండ్ ఆధారంగా నిర్ణయించారు. బ్రిటన్ తో భరత్ కు ఉన్న సంబంధాల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు, ఒక పౌండ్ కి 13.33 రూపాయలు. అదే సమయంలో ఒక డాలర్ కి 3.31 రూపాయలు. 1948-1964 మధ్యలో రూపాయి విలువ ఒక డాలర్ కి 4.78 రూపాయలకి తగ్గింది. అంటే, కరెన్సీ నోటుపై గాంధీ ఫోటో ముద్రించకముందు కూడా రూపాయి విలువ క్రమంగా తగ్గుతూనే ఉంది.
1969లో గాంధీజి శతజయంతి స్మారకార్ధం రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మొట్టమొదటి సారిగా గాంధీ ఫోటో ఉన్న రూ. 1, 2, 5, 10, 100 నోట్లని విడుదల చేసింది. ఐతే గాంధీ ఫోటో ఉన్న నోట్లు రెగ్యులర్ గా వాడకంలోకి వచ్చింది మాత్రం 1987లోనే. 1987లో రూ.500 నోటుపై నవ్వుతున్న గాంధీ ఫోటోతో మొదలయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా డేటా ప్రకారం 1970లో అమెరికన్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.7.5668 గా ఉంది, అదే 1987లో రూ. 12.9552 కి పెరిగింది. రూపాయి మారకం విలువ కొన్ని సంవత్చరాలు మినహా ప్రతి సంవత్చరం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018లో మారకం విలువ రూ.68.3895 గా ఉంది.
రూపాయి విలువ అనేది జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్బాలలో ఆర్ధిక వ్యవస్థని సరిచేయడానికి కావాలనే కరెన్సీ విలువని తగిస్తూ ఉంటారు. అంతేగాని గాంధీ ఫోటో కరెన్సీ నోటు పై ముద్రించడం మొదలు పెట్టినప్పటినుండి రూపాయి విలువ తగ్గిందన్న వాదనలో హేతుబద్ధత లేదు.
చివరగా, గాంధీ ఫోటో కరెన్సీ నోటు పై ముద్రించడం వల్ల రూపాయి విలువ తగ్గలేదు.