జవహర్ లాల్ నెహ్రు, మహమ్మద్ అలీ జిన్నా, షేక్ అబ్దుల్లా సొంత అన్నదమ్ములు అని, ఆ ముగ్గురికి భారతదేశాన్ని మూడు ముక్కలు చేసి మహాత్మా గాంధీ గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): జవహర్ లాల్ నెహ్రు, మహమ్మద్ అలీ జిన్నా, షేక్ అబ్దుల్లా సొంత అన్నదమ్ములు.
ఫాక్ట్ (నిజం): జవహర్ లాల్ నెహ్రు తండ్రి పేరు మోతిలాల్ నెహ్రు, తల్లి పేరు స్వరూప రాణి. మహమ్మద్ అలీ జిన్నా తండ్రి పేరు జిన్నాబాయి పూంజ, తల్లి పేరు మితిబాయి. షేక్ అబ్దుల్లా తండ్రి పేరు షేక్ మహమ్మద్ ఇబ్రహీం. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, మహమ్మద్ అలీ జిన్నా తల్లిదండ్రుల పేర్లు మితిబాయి, జిన్నాబాయి పూంజ అని పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక వెబ్సైటులో రాసి ఉన్నట్టు చూడవోచ్చు.
భారత పార్లమెంట్ డిజిటల్ లైబ్రరీ వెబ్సైటులో ఉన్న పుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రు తల్లిదండ్రుల పేర్లు స్వరూప్ రాణి , మోతిలాల్ నెహ్రు అని, షేక్ అబ్దుల్లా తండ్రి పేరు షేక్ మహమ్మద్ ఇబ్రహీం అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. వారి జీవిత చరిత్రలను కూడా ఆ పుస్తకాల్లో చదవొచ్చు. కావున, వీరు ముగ్గురు అన్నదమ్ములు కాదు.
ఇంతకముందు కూడా ఒకసారి ఎం.ఒ. మథాయ్ తన పుస్తకంలో మహమ్మద్ అలీ జిన్నా, షేక్ అబ్దుల్లా మోతీలాల్ నెహ్రూ కుమారులని రాసాడని ఒక మెసేజ్ వైరల్ అయినప్పుడు, అది తప్పు మెసేజ్ అని చెప్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.
చివరగా, జవహర్ లాల్ నెహ్రు, మహమ్మద్ అలీ జిన్నా, షేక్ అబ్దుల్లా సొంత అన్నదమ్ములు కాదు.