Fake News, Telugu
 

ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఒక పార్సీ, ముస్లిం కాదు

0

ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ ఖాన్ అని ఒక పాకిస్తాన్ టీవీ చర్చలో చెబుతున్న వీడియోను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ ఖాన్, అతనొక ముస్లిం.

ఫాక్ట్: ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ ఖాన్ కాదు, అతని పేరు ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ రెండు సార్లు 1952, 1957 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ సభ్యునిగా పనిచేసాడు. పార్లమెంట్ సభ్యుల లిస్టులో కూడా అతని పేరు ఫిరోజ్ గాంధీ అనే ఉంది. ఢిల్లీకి చెందిన మహామహోపాధ్యాయ పండిట్ లక్ష్మీధర్ శాస్త్రి నిర్వహించిన వైదిక కర్మల ప్రకారం ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల వివాహం జరిగింది. 08 సెప్టెంబర్ 1960న ఫిరోజ్ గాంధీ గుండెపోటుతో మరణించారు, తర్వాత ఫిరోజ్ గాంధీ సమాధి రాయి (Gravestone) అలహాబాద్ లోని పార్సీ శ్మశానవాటికలో ఉంచారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

వీడియోలో చెబుతున్నట్టుగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ ఖాన్ కాదు, అతని పేరు ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచి 1952 మరియు 1957 లో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసాడు. పార్లమెంట్ సభ్యుల లిస్టులో కూడా  అతని పేరు ఫిరోజ్ గాంధీ అనే ఉంది.

1957 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫిరోజ్ గాంధీ రాయ్ బరేలి నుండి పోటీ చేసి గెలిచారు. రాయ్ బరేలిలో అతని పేరుతో కాలేజీ కూడా ఉంది. రాయ్ బరేలి జిల్లాలో ఉన్నత విద్యకు ఫిరోజ్ గాంధీ కాలేజీ ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ కళాశాలను 08 ఆగష్టు 1960న అప్పటి పార్లమెంటు సభ్యుడు అయిన శ్రీ ఫిరోజ్ గాంధీ స్థాపించారు.

ప్రముఖ చరిత్రకారుడు రామ్ చంద్ర గుహ తన పుస్తకం “ఇండియా ఆఫ్టర్ గాంధీ”లో ఫిరోజ్ గాంధీ ఒక పార్సీ అని తెలిపాడు. “ఫిరోజ్ గాంధీ కూడా నెహ్రూ సొంత పట్టణమైన అలహాబాద్ కు చెందినవాడు. అతను ఒక పార్సీ, మొదట తన ఇంటిపేరు ‘ఘండీ’ (Ghandy) అని ఉండేది. అయితే, యువకుడిగా జాతీయోద్యమంలో చేరిన తరువాత, మహాత్మా గాంధీ కి అనుగుణంగా స్పెల్లింగ్ ను మార్చాడు.”

ఇందిరా నెహ్రు (పెళ్లి కాకముందు ఇందిరా గాంధీ యొక్క పేరు) వివాహం ఫిరోజ్ గాంధీతో 1942లో జరిగింది (ఫోటో). ఢిల్లీకి చెందిన మహామహోపాధ్యాయ పండిట్ లక్ష్మీధర్ శాస్త్రి నిర్వహించిన వైదిక కర్మల ప్రకారం ఈ వివాహం జరిగిందని అప్పటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఆర్టికల్ (4వ పేజీలో) లభించింది.

08 సెప్టెంబర్ 1960న ఫిరోజ్ గాంధీ గుండెపోటుతో మరణించారు. ఫిరోజ్ జహంగీర్ గాంధీ సమాధి రాయి (Gravestone) అలహాబాద్ లోని పార్సీ శ్మశానవాటికలో ఉంది.

చివరగా, ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఒక పార్సీ, ముస్లిం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll