Fake News, Telugu
 

అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్రంలోని దేవాలయ పూజారులకు 15,000 రూపాయల నెల జీతం ప్రకటించలేదు

0

హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని అస్సాం ప్రభుత్వం హిందూ ఆలయాలలో పనిచేస్తున్న పూజారులకు నెలకు 15,000 రూపాయల జీతం ప్రకటించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అస్సాం ప్రభుత్వం హిందూ ఆలయాలలో పనిచేస్తున్న పూజారులకు నెలకు 15,000 రూపాయల జీతం ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): కరోనా కారణంగా చాలా రోజులు దేవాలయాలను మూసివేసి ఆర్ధిక ఇబ్బందులు అనుభవిస్తున్న పూజారులకు అలాగే, వైష్ణవ నాంగోరియాలకు అస్సాం ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించింది. కాని, ఈ 15,000 రూపాయల ఆర్ధిక సహాయం కేవలం ఒక సారి మాత్రమే ఇస్తారు, పోస్టులో తెలుపుతున్నట్టు ప్రతి నెల 15,000 రూపాయలు జీతంగా ఇవ్వడం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, అస్సాం ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆలయ పూజారులకు అందిస్తున్న ఆర్ధిక సహాయానికి సంబంధించి ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ 05 నవంబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆలయ పూజారులకు అలాగే, వైష్ణవ నాంగోరియాలకు 15,000 రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు చేసిందని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. కానీ, ఈ ఆర్ధిక సహాయం పుజారులకి కేవలం ఒక సారి మాత్రమే ఇస్తారని ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా తెలిపారు.    

ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కరోనా వైరస్ కారణంగా దేవాలయాలను మూసివేసి ఆర్ధిక ఇబ్బందులలో పడ్డ ఆలయ పూజారులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ఆర్ధిక సహాయ పథకం తీసుకొచ్చినట్టు ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు.

నవంబర్ మొదటి వారంలో జరిగిన అస్సాం క్యాబినెట్ మీటింగ్లో ఈ ఆర్ధిక ప్యాకేజిని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఆమోదించింది. హిందూ దేవాలయ పూజారులకు, నాంగోరియాలకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తూ హిమంత బిశ్వ శర్మ 04 నవంబర్ 2021 నాడు ట్వీట్ కూడా పెట్టారు. పూజారులకు అందిస్తున్న ఆర్ధిక సహాయం కేవలం ఒక సారి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ట్వీట్లో స్పష్టంగా తెలిపారు. ఈ ఆర్ధిక సహాయం కోసం ధరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను రూపొందించనున్నట్టు స్పష్టం చేసారు.

చివరగా, అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర పూజారులకు ప్రతి నెల 15,000 రూపాయల జీతం అందించనున్నట్టు ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll