Fake News, Telugu
 

కుకీలందరూ శరణార్థులగా భారత్‌లో ప్రవేశించారని సంబంధంలేని ఒక లెటర్‌ను షేర్ చేస్తున్నారు

0

మణిపూర్‌లోని కుకీలు అసలు భారతీయులే కారని, వీరు బర్మా (మయన్మార్) నుండి శరణార్థులుగా వచ్చారని చెప్తూ, ఈ వాదనకు మద్దతుగా 1968 నాటి ఒక లేఖను షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కూడా వీరిని బర్మాకి చెందిన కాందిశీకులు గానే అభివర్ణించారని, ఆ తరవాతే వోట్ల కోసం మణిపురి హిందువుల మీద వీళ్ళను కూర్చోబెట్టారని ఈ పోస్టులో వాదిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్‌లోని కుకీ తెగలు నిజానికి బర్మా (మయన్మార్) నుండి శరణార్థులుగా వచ్చావచ్చారని తెలిపే 1968 నాటి లేఖ.

ఫాక్ట్(నిజం):  ఈ లెటర్ 1967లో ఖదావ్మీ ఆపరేషన్ సమయంలో మణిపూర్‌కు పారిపోయి వచ్చిన కుకీలకు భారత ప్రభుత్వం అందించబోయే మానవతా సహాయం అమలుకు సంబంధించింది. పైగా ఈ అంశానికి సంబంధించిన లెటర్లలో ఎక్కడ కూడా కుకీలందరు శరణార్థులని ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే పోస్టులో చెప్తున్న దానికంటే ముందే, అనగా 1972లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడక ముందు 1950లోనే కుకీలను (అస్సాంలో) STలుగా గుర్తించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కుకీలు :

భారత్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్‌లలో కనిపించే అనేక కొండ తెగలలో కుకీలు ఒకరు. మనదేశంలో కుకీలు మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అస్సాం, త్రిపుర మరియు నాగాలాండ్‌ మొదలైన ఈశాన్య రాష్ట్రాలలో కనిపిస్తారు. బ్రిటీష్ పాలనలో వీరితో సంబంధం ఉన్న తెగలన్నిటిని కలిపి ‘కుకీ’ అని పిలిచేవారు. కుకీలు 1777లోనే లుషై కొండల(మిజోరంలో) ఆవాసం చేసుకొని నివసించేవారని 1907 నాటి ‘ఫ్రాంటియర్ అండ్ ఓవర్సీస్ ఎక్స్‌పెడిషన్స్ ఫ్రమ్ ఇండియా’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తరవాత కూడా 1820 నుండి వివిధ రాజ్యాల కాలంలో కుకీ ప్రజల గురించి ప్రస్తావన ఉంది.

దీన్నిబట్టి కుకీలకు చాలా సంవత్సరాల నుండే భారత్‌తో సంబంధం ఉందని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే పోస్టులో చెప్తున్న దానికంటే ముందే, అనగా 1972లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడక ముందు 1950లోనే కుకీలను (అస్సాంలో) STలుగా గుర్తించారు.

ఇకపోతే పోస్టులో షేర్ చేసిన లెటర్ విషయాని వస్తే ఈ లెటర్ 1967లో ఖదావ్మీ ఆపరేషన్ సమయంలో మణిపూర్‌కు పారిపోయి వచ్చిన కుకీలకు భారత ప్రభుత్వం అందించబోయే మానవతా సహాయం అమలుకు సంబంధించిందని తెలుస్తుంది. మీడియా కథనాలు మరియు ఈ విషయానికి సంబంధించి అంతకు ముందు రాసిన లెటర్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పైగా ఈ లెటర్లలో ఎక్కడ కూడా మణిపూర్‌లోని కుకీలందరు శరణార్థులని ప్రస్తావించలేదు.

చివరగా, కుకీలందరు శరణార్థులగా భారత్‌లో ప్రవేశించారని సంబంధంలేని ఒక లెటర్‌ను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll