Fake News, Telugu
 

హుజూరాబాద్ పోలీసుల తనిఖీల్లో ఈటల రాజేందర్ అనుచరుని వద్ద 12 కోట్లు లభ్యమయ్యాయన్న వార్తలో నిజం లేదు

0

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక కారులో ఈటల రాజేందర్ అనుచరుని వద్ద 12 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి అని చెప్తూ, దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈటల రాజేందర్ అనుచరుని వద్ద 12 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి.

ఫాక్ట్ (నిజం): హుజురాబాద్‌ పోలీస్ తనిఖీల్లో ఈటల రాజేందర్ అనుచరుని వద్దగాని లేక మరే ఇతర నాయకుడు/పార్టీలకు చెందిన వారి దగ్గర గానీ 12 కోట్ల రూపాయలు దొరికినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదును సరైన పత్రాలు లేని కారణంగా పోలీసులు సీజ్ చేసినట్టు గత వారం జిల్లా కలెక్టర్ ఒక మీడియా ప్రకటనని విడుదల చేసారు. పైగా పోస్టులో షేర్ చేసిన ఫోటోకి హుజూరాబాద్ ఎన్నికకి ఎటువంటి సంబంధంలేదు. ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హుజూరాబాద్ పోలీస్ తనిఖీల్లో ఈటల రాజేందర్ అనుచరుని వద్దగాని లేక మరే ఇతర నాయకుడు/పార్టీలకు చెందిన వారి దగ్గర గానీ 12 కోట్ల రూపాయలు దొరికినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఒకవేళ నిజంగానే ఇంత మొత్తంలో నగదు దొరికి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది.

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో పోలీసులు సీజ్ చేసిన నగదు, ఇతర వస్తువులపై గత వారం జిల్లా కలెక్టర్ ఒక మీడియా ప్రకటనని విడుదల చేసారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ప్రకటన ప్రకారం హుజూరాబాద్‌లో ‘ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదును, 1,50,000 రూపాయల విలువ గల 30 గ్రాముల బంగారం, 9,10,000 రూపాయల విలువ గల 14 కిలోల వెండిని, 5,11,652 రూపాయల విలువ గల 867 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే 2,21,000 రూపాయల విలువ గల 66 చీరలు, 50 షర్టులను సరైన పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకొని సీజ్ చేసారు.’

పైగా పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని ప్రచురించిన ఒక 2019 వార్తా కథనం మాకు కనిపించింది. 2019 సాధారణ ఎలక్షన్ సందర్బంగా తమిళనాడు పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా లభ్యమైన వాటి వివరాలు రిపోర్ట్ చేసిన ఈ కథనంలో ఇదే ఫోటోని వాడారు. దీన్నిబట్టి, ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని, ఈ ఫోటోకి హుజూరాబాద్ ఉపఎన్నికకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇంతకుముందు కూడా ఇలాగే కమలాపూర్‌లో ఈటల రాజేందర్‌ యొక్క జమున హేచరీలకు చెందిన 122 కోట్లు దొరికాయంటూ సోషల్ మీడియా వార్త షేర్ అయ్యింది. ఐతే ఈ వార్తలో నిజంలేదంటూ FACTLY రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, హుజూరాబాద్ పోలీసుల తనిఖీల్లో ఈటల రాజేందర్ అనుచరుని వద్ద 12 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll