Fake News, Telugu
 

1954 నుంచే పెట్రోలియం ఉత్పత్తులని, 2000 నుండే విమాన ఇంధనాన్ని భారత్ విదేశాలకు ఎగుమతి చేస్తోంది

0

ఇటీవల ఇండియన్ ఆయిల్ కంపెనీ స్వదేశంలో ఉత్పత్తి చేసిన విమాన ఇంధనం(AVGAS 10 LL) మొదటి బ్యాచ్‌ని విదేశానికి ఎగుమతి చేసిన నేపథ్యంలో, భారతదేశ చరిత్రలోనే పెట్రోల్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జనవరి 2023లో ‘పపువా న్యూ గినీ’ దేశానికి ఇండియన్ ఆయిల్ కంపెనీ విమాన ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం చరిత్రలో మొదటిసారిగా పెట్రోలును మరొక దేశానికి ఎగుమతి చేసింది.

ఫాక్ట్: ఇటీవల భారత్ ‘AVGAS 10 LL’ అనే ఒక రకమైన విమాన ఇంధనాన్ని మొదటిసారి స్వదేశంలో తయారు చేసి విదేశానికి ఎగుమతి చేయడం నిజమే అయినప్పటికీ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, 1954 నుంచే భారత్ పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాగే, 2000 సంవత్సరం నుంచి వివిధ రకాల విమాన ఇంధనాలని ఎగుమతి చేస్తోంది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారతదేశం మొట్ట మొదటిసారిగా ‘AVGAS 10 LL’ అనే విమాన ఇంధనాన్ని స్వదేశంలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం నిజమే అయినప్పటికీ, గతంలో భారత్ ఇతర దేశాలకు పెట్రోల్ లేదా పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి  పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్లో ఉన్న నివేదికలని పరిశీలించాము. వీటిలో భారత్ 1954 నుంచే విదేశాలకు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు గణాంకాలు ఉన్నాయి.

మరియు, భారత్ 2000 సంవత్సరం నుంచి కూడా ప్రతియేటా వివిధ రకాలు పెట్రోలియం ఉత్పత్తులతో పాటు Aviation Turbine Fuel(ATF) ని  కూడా ఎగుమతి చేస్తోంది.

ATF ని విమానాలు, హెలికాప్టర్లలో ఇంధనంగా వాడుతారు. ఇటీవల ‘పపువా న్యూ గినీ’ దేశానికి ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉత్పత్తి చేసిన మరో రకమైన విమాన ఇంధనం ‘AVGAS 10 LL’ ని పైలట్ శిక్షణలో వాడే చిన్న విమానాలలో మరియు మానవ రహిత విమానాలలో వినియోగిస్తారు.

చివరిగా, భారత్ విదేశాలకు పెట్రోలియం ఉత్పత్తులను 1954 నుంచే ఎగుమతి చేస్తోంది.

Share.

About Author

Comments are closed.

scroll