Fake News, Telugu
 

ముస్లిం బాలిక బురఖా ధరించలేదని KKRTC డ్రైవరు ఆమెను బస్సు ఎక్కకుండా అడ్డగించిన ఘటనను కర్ణాటక ‘ఉచిత బస్సు ప్రయాణం’ పథకానికి ముడిపెడుతున్నారు

0

కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీసులను వాడుకోవాలంటే బురఖా ధరించి రావాలనే కొత్త నియమాన్ని అమలు చేస్తున్నారని, బురఖా ధరించకపోతే బస్సు నుండి బలవంతంగా బయటకు దింపేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. బురఖా ధరించనందుకు తనని బస్సు నుండి దిగమన్నారని హిజాబ్ ధరించి ఉన్న ఒక బాలిక వీడియోలో మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీసులను వాడుకోవాలంటే బురఖా ధరించి రావాలంటున్నారని, బురఖా ధరించకపోతే  బస్సు నుండి బలవంతంగా దింపేస్తున్నారంటూ షేర్ చేస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలోని కమలపురా బస్టాండులో ఒక ముస్లిం పాఠశాల విధ్యార్ధిని బురఖా ధరించలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆమెను బస్సు ఎక్కకుండా అడ్డగించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ముస్లిం విధ్యార్ధినులు అందరూ బురఖా ధరించే బస్సు ఎక్కలని ఈ డ్రైవరు డిమాండ్ చేయడంతో ముస్లిం విధ్యార్ధిని టీచర్ అతనితో వాగ్వాదానికి దిగి అతనిపై పోలీస్ కేసు నమోదు చేశారు. బాధిత విధ్యార్ధిని జరిగిన ఘటనను వివరిస్తున్న దృశ్యాలను పోస్టులో షేర్ చేసిన వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోలని ‘న్యూస్ 18’, ‘ఇండియా టుడే’ వార్తా సంస్థలు ఇటీవల పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ముస్లిం పాఠశాల విధ్యార్ధిని బురఖా ధరించలేదని ఒక ఆర్టీసీ డ్రైవరు ఆమెను బస్సులోకి ఎక్కకుండా అడ్డగించిన ఘటన కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలో చోటుచేసుకుందని ఈ వీడియోలలో తెలిపారు. 

కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలోని కమలపురా బస్టాండులో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మెహబూబ్ పాటేల్ అనే KKRTC డ్రైవర్, ఒక ముస్లిం విద్యార్ధిని బస్సు ఎక్కుతుండగా, ముస్లిం అమ్మాయివి అయ్యుండి నువ్వు బురఖా ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా బురఖా ధరిస్తే గాని బస్సు ఎక్కకూడదని ఆమెను బస్సు ఎక్కకుండా ఆపేశాడు. దీనితో ఆ ముస్లిం బాలిక, ఆమె టీచర్ ఆ డ్రైవరుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముస్లిం బాలిక చదువుతున్న పాఠశాలలోని యాజమాన్యం డ్రైవరుపై కేసు కూడా నమోదు చేసింది.

ముస్లిం బాలికతో దురుసుగా ప్రవర్తించిన మెహబూబ్ పాటేల్‌ను KKRTC సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, కలబురగిలో ముస్లిం బాలిక బురఖా ధరించలేదని KKRTC డ్రైవరు ఆమెను బస్సు ఎక్కకుండ అడ్డగించిన ఘటనను కర్ణాటక ‘ఉచిత బస్సు ప్రయాణం’ పథకానికి ముడిపెడుతున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll