ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉధృతమైన వరదలు వచ్చాయి. తీవ్రమైన వర్షపాతం మరియు వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో,“జగనన్న ఇచ్చిన సొమ్ము తీని విశ్వాసం లేకుండా చంద్రబాబుకు ఓటు వేసి పెద్ద తప్పు చేసాము అని విజయవాడ ప్రజలు అన్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఒక వరద బాధిత మహిళ గతేడాది వరద వస్తే పదివేలు ఇచ్చాడు ఆయన, అయినా ఆయనకు ఓటు వేయని విశ్వాసం లేని వారిని మేము అని అన్నాడు మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: “జగనన్న ఇచ్చిన సొమ్ము తీని విశ్వాసం లేకుండా చంద్రబాబుకు ఓటు వేసి పెద్ద తప్పు చేశామని” విజయవాడ ప్రజలు చెప్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో తెలంగాణలోని ఖమ్మం వరద భాదితులు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో ‘MIRROR TV’ అనే లోగో ఉండటం మనం గమనించవచ్చు. దీని ఆధారంగా ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా ‘’MIRROR TV’ అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి లభించింది. ఈ యూట్యూబ్ ఛానల్ లో వెతకగా, ఇదే వైరల్ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియోను 04 సెప్టెంబర్ 2024న “ఖమ్మం అల్లకల్లోలం.. Khammam Floods Effects | Mirror TV Ground Report | CM Revanth Reddy | PublicTalk” అనే శీర్షికతో ఈ ఛానల్ పబ్లిష్ చేసినట్లు కనుగొన్నాము.
ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం ఈ వీడియో తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి సంబంధించినది తెలుస్తుంది. ఈ వీడియోను పూర్తిగా పరిశీలిస్తే, ఈ వీడియో మిర్రర్ టీవీ(’MIRROR TV) అనే యూట్యూబ్ ఛానెల్ ఖమ్మం వరద బాధితులను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది అని అర్థమవుతుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి, ఈ వరదల కారణంగా ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలు భారీగా దెబ్బతిన్నాయి.(ఇక్కడ,ఇక్కడ)
చివరగా, ఈ వైరల్ వీడియో తెలంగాణలోని ఖమ్మం వరద బాధితులు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది.