Fake News, Telugu
 

న్యూజెర్సీలో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నది అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS), ఇస్కాన్ కాదు

0

అమెరికాలోని న్యూజెర్సీలో ఇస్కాన్ నిర్మించిన అతిపెద్ద దేవాలయం అంటూ ఒక గుడి వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇస్కాన్ నిర్మించిన అతిపెద్ద దేవాలయం వీడియో.

ఫాక్ట్ (నిజం): అమెరికాలోని న్యూజెర్సీలో రాబిన్స్‌విల్లె ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నది బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS), ఇస్కాన్ కాదు. ఈ ఆలయ నిర్మాణం 2010లోనే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. కాకపోతే 2014 నుండే ఈ దేవాలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఇస్కాన్ కూడా న్యూజెర్సీలో ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నది, అది కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో ఉన్నది అమెరికాలోని న్యూజెర్సీలో నిర్మాణంలో ఉన్న హిందూ దేవాలయమే అయినప్పటికీ ఈ దేవాలయాన్ని నిర్మించింది ఇస్కాన్ కాదు. ఈ దేవాలయాన్ని న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లె ప్రాంతంలో బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) వారు నిర్మిస్తున్నారు.

ఈ దేవాలయం నిర్మాణం 2010లోనే మొదలైంది, పోస్టులో చెప్తున్నట్టు 2017లో కాదు. 2010 దేవాలయ నిర్మాణ పనులు మొదలవగా, వివిధ దశలలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఐతే 2014 నుండే ఈ దేవాలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. BAPS చెప్తున్న దాని ప్రకారం ఇది అమెరికాలోనే అతి పెద్ద హిందూ దేవాలయం కానుంది. ఈ దేవాలయం నిర్మాణానికి వేల మంది భారతీయలు నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఐతే ఈ గుడి నిర్మాణంలో పని చేసిన భారతీయలు కొందరు అమెరికా కార్మిక మరియు ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఉల్లంఘిస్తూ తమతో ఎక్కువ గంటలు పని చేయించుకొని తక్కువ డబ్బులు చెల్లించారని 2021 మార్చ్ లో BAPS పై ఒక లాసూట్ ఫైల్ చేసారు. అయితే, ఈ గుడి నిర్మాణం చేపట్టిన కన్హా అనే నిర్మాణ సంస్థ అనేక లేబర్ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిందని, దానికి గుడి యాజమాన్యంతో సంబంధం లేదని కొంత మంది వివరణ ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఐతే న్యూజెర్సీలో ఇస్కాన్ కూడా ఒక దేవాలయాన్ని నిర్మిస్తుంది, ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. కాని పోస్టులోని వీడియోకి ఇస్కాన్ కి ఎటువంటి సంబంధంలేదు.

చివరగా, న్యూజెర్సీలో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నది బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS), ఇస్కాన్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll