“గోభక్తి, దేశభక్తి పేర్లతో జరుగుతున్న మూకదాడులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాడి చేసే దుండగులు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆత్మరక్షణ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన ఈ తీర్పు ఆత్మ రక్షణ హద్దులను విస్తరించింది.” అని చెప్తూ ఒక ఆర్టికల్ ఫోటోని సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మూకదాడులు జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఫాక్ట్: మూకదాడులు జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జులై 2018 లో తెహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో మూకదాడుల గురించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ తీర్పులో ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకుండా చూడవలసిన బాధ్యత కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఉందని తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, సుప్రీం కోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి తీర్పు గనక కోర్టు ఇచ్చి ఉంటే వార్తాపత్రికలు ప్రచురించేవి, కాని అలా జరగలేదు. సుప్రీం కోర్టు వెబ్సైటులో కూడా కీ-వర్డ్స్ తో వెతకగా, అలాంటి తీర్పు ఇచ్చినట్టుగా దొరకలేదు.
అయితే జులై 2018లో తెహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మూకదాడుల గురించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ తీర్పులో ఏ ఒక్కరు కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకుండా చూడవలసిన బాధ్యత కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఉందని చెప్పింది. పార్లమెంట్లో మూకదాడులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018 లో వచ్చిన ఈ గైడ్లైన్స్ ఉన్నా కూడా, ఇంకా మూకదాడులు కొనసాగుతున్నాయి. ఇండియా ఫోరమ్ వారి ఆర్టికల్‌లో, 2018 తీర్పును ఇప్పటివరకు అమలు చేయలేదని, సుప్రీంకోర్టు దీనిని బాగా పరిశీలించాలని తెలిపారు.
దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగం జీవించే హక్కుని (“No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law”) కల్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి జీవితం కాపాడేందుకు రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ చూడొచ్చు. కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు అనలేదు.
పోస్టులో హై కోర్టు, సుప్రీంకోర్టు అని ద్వంద్వ అర్ధాలతో కూడా ప్రస్తావించారు. హై కోర్టు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోమని అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
చివరగా, మూకదాడులు జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.