భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు చైనా రాష్ట్రపతి జిన్‌పింగ్ కుంగ్ ఫు చేస్తున్నట్లుగా ఉన్న ఒక యానిమేషన్ వీడియోని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘జపాన్ దేశంలో మోడీజీ స్టామినా చూపించే వీడియో చేశారు’ అని దాని గురించి చెప్తున్నారు. ఆ యానిమేషన్ వీడియో లో మోదీ మరియు జిన్‌పింగ్ తలపడ్తుంటారు. మోదీ, అమెరికా రాష్ట్రపతి డోనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా రాష్ట్రపతి పుతిన్ ల సహకారంతో విజేతగా నిలుస్తాడు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మోడీ సత్తాని తెలుపుతూ జపాన్ దేశం వారు తీసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ యానిమేషన్ వీడియో ని ‘ఇండియా టుడే’ గ్రూప్ వారు తమ యానిమేషన్ సిరీస్ ‘SoSorry’ కోసం రూపొందించారు. కావున, ఆ వీడియో జపాన్ దేశం వారు తీసినది కాదు, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టు లోని యానిమేషన్ వీడియో కి కుడి వైపు పై భాగం లో ‘Aaj Tak’ లోగో ని చూడవచ్చు. దాంతో గూగుల్ లో ‘Modi Xi Jinping animation video Aaj Tak’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ఆ వీడియో కి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. ఆ వీడియో ని ‘SoSorry’ అనే యూట్యూబ్ ఛానెల్ ‘27 జూన్ 2020’ న అప్లోడ్ చేసింది.
‘SoSorry’ ఛానెల్ యొక్క వివరణలో అది ‘ఇండియా టుడే’ గ్రూప్ (‘India Today’ & ‘Aaj Tak’ channels) వారు రూపొందించే ఒక పొలిటూన్స్ సిరీస్ అని ఉంది.
అయితే, పోస్టు లోని వీడియో క్లిప్ లో ‘జపనీస్’ భాషలో సబ్ టైటిల్స్ వస్తాయి. దాంతో, ‘Modi Xi Jinping shinzo Abe ’ అనే పదాల యొక్క జపనీస్ ట్రాన్స్ లేషన్ తో వెతికినప్పుడు, ‘జపనీస్’ సబ్ టైటిల్స్ తో ఉన్న వీడియో ని ‘アンティレッド’(anti red) పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. ‘BOOM’ ఆ ఛానెల్ ని సంప్రదించినప్పుడు, వారు ‘SoSorry’ ఛానెల్ యొక్క వీడియో కి ‘జపనీస్’ సబ్ టైటిల్స్ కలిపి తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసినట్లుగా తెలిపారు.
చివరగా, ‘ఇండియా టుడే’ గ్రూప్ రూపొందించిన యానిమేషన్ వీడియో ని పోస్టు చేసి ‘జపాన్ దేశంలో మోడీజీ స్టామినా చూపించే వీడియో చేశారు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.