Fake News, Telugu
 

వారణాసిలోని శ్రీ మని మందిర్ దేవాలయంలోని దృశ్యాలని పునరుద్ధరించబడిన కాశీ విశ్వనాధ్ దేవాలయం అని షేర్ చేస్తున్నారు

0

వారణాసిలో పునరుద్ధరించబడిన కాశీ విశ్వనాధ్ దేవాలయంలోని దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: వారణాసిలో పునరుద్ధరించబడిన కాశీ విశ్వనాధ్ దేవాలయంలోని దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నది వారణాసిలోని శ్రీ మని మందిర్ దేవాలయం, కాశీ విశ్వనాధ్ దేవాలయం కాదు. శ్రీ ధర్మ సంఘ్ అనే సంస్థ ఈ దేవాలయాన్ని నడుపుతున్నారు. కాశీ విశ్వనాధ్ దేవాలయ గర్భ గుడిలో ఎటువంటి మార్పులు చేయడం లేదని, దేవాలయ పరిసర ప్రాంతంలో చేస్తున్న కాశీ విశ్వనాధ్ కారిడార్ అభివృద్ధి పనులు నవంబర్ 2021 వరకు పూర్తవుతాయని కాశీ విశ్వనాధ్ దేవాలయం ట్రస్ట్ అధికారులు మీడియాకి తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘InnovationMotiv Media’ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది వారాణసిలోని శ్రీ మని మందిర్ దేవాలయం లోని దృశ్యాలని వివరణలో తెలిపారు. ఈ శ్రీ మని మందిర్ దేవాలయాన్ని శ్రీ ధర్మ సంఘ్ సంస్థ వారు నడిపిస్తున్నట్టు ఇందులో తెలిపారు. శ్రీ మని మందిర్ దేవాలయంలోని మరికొన్ని దృశ్యాలని చూపుతూ పబ్లిష్ అయిన వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

‘InnovationMotiv Media’ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియోని ‘శ్రీ మని మందిర్ దేవాలయం’ వారు తమ వెబ్సైటులో పబ్లిష్ చేసారు. ఈ దేవాలయంలోని దృశ్యాలని చూపుతున్న మరికొన్ని ఫోటోలని కూడా తమ వెబ్సైటులో పబ్లిష్ చేసారు. శ్రీ మని మందిర్ దేవాలయంలో ఫిబ్రవరి 2020 లో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం గురించి రిపోర్ట్ చేస్తూ ‘Amar Ujala’ న్యూస్ వెబ్సైటు ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.

‘శ్రీ ధర్మ సంఘ్’ వారి వెబ్సైటులో కూడా ఈ దేవాలయానికి సంబంధించి మరికొన్ని ఫోటోలని మనం చూడొచ్చు. శ్రీ మని మందిర్ దేవాలయానికి సంబంధించి షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలోని దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలతో పోలి ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది వారణాసిలోని శ్రీ మని మందిర్ దేవాలయమని, కాశీ విశ్వనాధ్ దేవాలయం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018లో ప్రారంభించిన కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రాజెక్ట్ నవంబర్ 2021 వరకు పూర్తి అవుతుందని ఆ ప్రాజెక్ట్ డివిజనల్ కలెక్టర్ మీడియాకి తెలిపారు. కాశీ విశ్వనాధ్ దేవాలయం పునరుద్ధికరణ సమాచారం కోసం ‘India Today’ న్యూస్ సంస్థ శ్రీ కాశీ విశ్వనాధ్ క్షేత్ర ట్రస్ట్ అధికారులని సంప్రదించగా, కాశీ విశ్వనాధ్ దేవాలయ గర్భగుడిలో ఎటువంటి పునరుద్ధరణ పనులు చేపట్టలేదని వారు స్పష్టం చేసారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘India Today’ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వారణాసిలోని శ్రీ మని మందిర్ దేవాలయంలోని దృశ్యాలని పునరుద్ధరించబడిన కాశీ విశ్వనాధ్ దేవాలయంలోని దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll