చేతిలో చిన్నపిల్లని ఎత్తుకొని పండ్లు అమ్ముతున్న ఒక మహిళ తన పండ్ల బండిని పైకి (ఎత్తైన ప్రదేశానికి) నెట్టడానికి కష్టపడుతున్నప్పుడు, చుట్టుపక్కల నుండి వెళ్తున్నవారెవరూ సహాయం చేయని సమయంలో ఇద్దరు చిన్న పిల్లలు బండిని పైకి తరలించడానికి ఆ మహిళకి సహాయపడే ఒక 49 సెకండ్ల నిడివిగల వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘పరిమళించిన మానవత్వం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని నిజంగా జరిగిన సంఘటనలాగా షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పండ్ల బండిని పైకి తరలించడానికి ఇద్దరు చిన్న పిల్లలు సహాయం చేసిన ఘటన యొక్క దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు కల్పితమైనవి, నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. నటీనటులతో వీటిని చిత్రీకరించారు. సమాజంలో అవగాహన కల్పించేందుకు ఈ వీడియోలను రూపొందించారు. ఐతే ఒరిజినల్ వీడియో చివర్లో ఉండే వివరణ భాగాన్ని తీసేసి కేవలం మిగతా భాగాన్ని నిజమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోలోని దృశ్యాలు కల్పితమైనవి, నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు. వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం ఫేస్‌బుక్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో యొక్క పూర్తి నిడివిగల వీడియోని ప్రముఖ నటి పూనమ్ బజ్వా 2022 జనవరిలో తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన పోస్టు మాకు కనిపించింది.
ఐతే పూనమ్ బజ్వా ఈ పూర్తి వీడియోని షేర్ చేసిన పోస్టులో ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు ఆమె స్పష్టంగా పేర్కొంది. సమాజంలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఇలాంటి మరికొన్ని వీడియోలను పూనమ్ బజ్వా తన టైంలైన్‌లో షేర్ చేసింది.
పైగా వీడియో చివర్లో కూడా ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్లు స్పష్టంగా ఒక వివరణ కూడా ఉంది. దీన్నిబట్టి, ఈ ఒరిజినల్ వీడియోలో వివరణ ఉన్న భాగాన్ని తీసేసి కేవలం మిగతా భాగాన్ని నిజమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.
పూనమ్ బజ్వా షేర్ చేసిన వీడియోలో ‘@IdeasFactory’ అనే వాటర్‌మార్క్ స్పష్టంగా చూడొచ్చు. బహుశా ‘IdeasFactory’ అనే సంస్థ ఈ వీడియోని రూపొందించి ఉండొచ్చు. ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు ఈ సంస్థ ఫేస్‌బుక్ పేజీలో ఉన్నాయి. ఐతే పోస్టులో షేర్ చేసిన వైరల్ వీడియోకి సంబంధించి మరింత స్పష్టత కోసం మేము IdeasFactory మరియు పూనమ్ బజ్వాని ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది.
ఇటీవల కాలంలో కొందరు ప్రముఖ వ్యక్తులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఇలాంటి అవగాహన కల్పించే వీడియోలను షేర్ చేస్తున్న ట్రెండ్ పెరుగుతోంది. ఐతే కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోల చివర్లోని వివరణ భాగాన్ని తీసేసి, కేవలం మిగతా భాగాన్ని మాత్రమే నిజమైన సంఘటనలాగా షేర్ చేస్తున్నారు, మరికొందరు ఈ వీడియోలను మతపరమైన అభియోగాలు చేస్తూ కూడా షేర్ చేస్తున్నారు. ఇలాంటి కొన్ని వీడియోల గురుంచి FACTLY రాసిన ఫాక్ట్ చెక్ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, వీడియోలోని దృశ్యాలను నటీనటులతో చిత్రీకరించారు.