Fake News, Telugu
 

జూలై 2014 – జూలై 2020 మధ్యలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది; కేంద్ర పన్ను 23.5 రూపాయలు పెరిగింది.

0

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో (జూలై 2004 – జూలై 2014 మధ్య) పెట్రోల్ ధర 41 రూపాయలు పెరిగిందని, కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో (జులై 2014 – జూలై 2020) మధ్య పెట్రోల్ ధర కేవలం 2 రూపాయలే పెరిగిందని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జులై 2014 – జులై 2020 మధ్య పెట్రోల్ ధర కేవలం రెండు రూపాయలు మాత్రమే పెరిగింది.

ఫాక్ట్ (నిజం): పెట్రోల్ ధర అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర, వివిధ కేంద్ర మరియు రాష్ట్రల పన్నుల పై ఆధార పడి ఉంటుంది. జూలై 2014 లో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ బారెల్ ధర 106.3 డాలర్లు ఉండగా, జూన్ 2020 లో అది కేవలం సుమారు 38.5 డాలర్లు మాత్రమే ఉంది. కానీ, జులై 2014 లో ప్రతి లీటర్ పెట్రోల్ పై కేంద్ర పన్ను (ఎక్సైజ్ డ్యూటీ) 9.48 రూపాయలు ఉండగా, దాన్ని జూలై 2020 నాటికి 32.98 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పెంచింది. వివిధ రాష్ట్రల పన్నులు కూడా ఈ కాలంలో పెరిగాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినా, ఎక్కువ పన్నులు తీసుకుంటూ పెట్రోల్ ధరను ఎక్కువగానే ఉంచుతున్నారు. కావున పోస్ట్ లో పెట్రోల్ ధర కేవలం రెండు రూపాయలు మాత్రమే పెరిగిందని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పెట్రోల్ ధర అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర, వివిధ కేంద్ర మరియు రాష్ట్రల పన్నుల పై ఆధార పడి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ని భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది, కాబట్టి దేశంలోని పెట్రోల్ ధర అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరని బట్టి మారుతూ ఉంటుంది. ఏప్రిల్ 2000 నుండి జూన్ 2020 మధ్య అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర (ఇండియన్ బాస్కెట్) వివరాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘Petroleum Planning and Analysis Cell’ వారి వెబ్సైటులో చూడవొచ్చు. జులై 2004 లో క్రూడ్ ఆయిల్ ధర బారెల్ కి 36.35 డాలర్లు ఉండగా, జూలై 2014 నాటికి అది 106.3 డాలర్లకి పెరిగింది. కానీ, జూన్ 2020 లో అది సుమారు 38.5 డాలర్లకి తగ్గింది. ఏప్రిల్ 2000 నుండి ప్రతి నెల అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ బారెల్ ధర కింద గ్రాఫ్ లో చూడవొచ్చు.

కానీ, జులై 2014 లో ప్రతి లీటర్ పెట్రోల్ పై కేంద్ర పన్ను (ఎక్సైజ్ డ్యూటీ) 9.48 రూపాయలు ఉండగా, దాన్ని జూలై 2020 నాటికి 32.98 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినా, ఎక్కువ పన్నులు తీసుకుంటూ పెట్రోల్ ధరను ఎక్కువగానే ఉంచుతున్నారు. అనేక రాష్ట్రాలు కూడా ఈ కాలంలో పన్నులు పెంచాయి.

పెట్రోల్ ధర పై రాష్ట్ర పన్ను ప్రతి రాష్ట్రంలో వేరేగా ఉంటుంది. వివిధ రాష్ట్రల ప్రస్తుత పన్నుల వివరాలు ఇక్కడ చూడవొచ్చు. ప్రస్తుత పన్నుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని పెట్రోల్ ధరల్లో కేంద్ర పన్ను కంటే రాష్ట్ర పన్ను ఎక్కువ కాదు. తప్పుడు వివరాలతో ఇంతకముందు కొందరు పోస్ట్ చేయగా, పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నుల గురించి వివరిస్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, జూలై 2014 – జూలై 2020 మధ్యలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది; కేంద్ర పన్ను 23.5 రూపాయలు పెరిగింది. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll