Fake News, Telugu
 

తప్పుడు లెక్కలు పెట్టి, పెట్రోల్ ధరలో వివిధ పన్నుల వివరాలు అని షేర్ చేస్తున్నారు

0

సామాన్య ప్రజలు కొనే పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ గురించి ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. దేశంలో పెట్రోల్ మీద అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కూడా పోస్టులో ఉంటుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పెట్రోల్ ధరలో వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు. దేశంలో పెట్రోల్ మీద అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

ఫాక్ట్ (నిజం): పెట్రోల్ పై విధించే వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ కి సంబంధించి ఈ పోస్టులో పేర్కొన్నవివరాలు కరెక్ట్ కావు. పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం రూ. 21.73 పైసలు పన్ను రూపంలో వసూలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభ్తువం రూ. 19.80 పైసలు వసూలు చేస్తుంది. అంతేకాదు, పెట్రోల్ మీద అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఇండియన్ ఆయిల్ వెబ్సైటులో పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు చూడవొచ్చు (ఆ వివరాలు హిందూస్తాన్ పెట్రోలియం మరియు భారత్ పెట్రోలియం వెబ్సైటుల్లో కూడా చూడవొచ్చు). ఆ వివరాలు ఢిల్లీ కి సంబంధించినవి ఉంటాయి. స్టేట్ పన్ను (వాట్) తప్ప మిగితాయి అన్నీ దేశమంతా ఒకేలా ఉంటాయి. కావున, పెట్రోల్ పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ పన్ను ఎంత ఉంటుందో చివరికి చూద్దాం.

పోస్టులో ఇచ్చిన పెట్రోల్ ధర వివరాలను అసలు పెట్రోల్ ధర వివరాలతో పోల్చిచూద్దాం.

క్రూడ్ ఆయిల్, రిఫైనరీ, మరియు రవాణా – Rs 26/Ltr? కాదు.
బేస్ ధర, రవాణా మరియు ఇతర వాటికి కలిపి Rs 28.28/Ltr అని ఇండియన్ ఆయిల్ వెబ్సైటులో చూడవొచ్చు.

డీలర్ కమిషన్ – Rs 5/Ltr? కాదు.
సగటున డీలర్ కమిషన్ Rs 3.54/Ltr  అని చూడవొచ్చు.

కేంద్ర పన్నులు – Rs 14/Ltr (అందులో 42% రాష్ట్రాలకి డైరెక్ట్ గా వెళ్తాయి)? కాదు.
ఎక్సైజ్ డ్యూటీ Rs 22.98/Ltr అని ఇండియన్ ఆయిల్ వెబ్సైటులో చూడవొచ్చు.

పెట్రోల్ మరియు డీజిల్ పై విదించే టాక్స్ లో కేంద్ర మరియు రాష్ట్ర వాట:

పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ (BED), స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) మరియు అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) (AED) రూపంలో పన్నులను వసూలు చేస్తుంది.

స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (SAED) 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు. ఐతే ఈ ఆక్ట్ లో చెప్పిన దాని ప్రకారం, SAED  కింద వసూలు చేసే ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం సర్ ఛార్జి రూపంలో వసూలు చేస్తారు కాబట్టి, వసూలు చేసే మొత్తం కేంద్రానికే చెందుతుంది. అంటే స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) ద్వారా వసూలు చేసేది డివిజబుల్ పూల్ లోకి రాదు, అంటే ఇందులో రాష్ట్రలుకు ఎటువంటి వాటా ఉండదు.

ఇక పెట్రోలుపై అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (AED) 1998 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు, దీనినే రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని కూడా అంటారు. ఐతే ఈ 1998 ఫైనాన్స్ ఆక్ట్ ప్రకారం అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసింది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్తుంది, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. ఇదే విధంగా డీజిల్ పై కూడా AEDని 1999 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశ పెట్టారు. దీంట్లో కూడా రాష్ట్రాలకు వాటా ఉండదు. ఈ రెండు తీసేస్తే మిగిలిన బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే దాంట్లో నుండి మాత్రమే రాష్ట్రాలకు 42% వాటా ఉంటుంది. ఈ 42% ని కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్క నిష్పత్తిలో పంచుతారు.

ఐతే ఫైనాన్స్ చట్టం, 2018  ద్వారా ఇంతకు ముందు లీటర్ పెట్రోల్ పై  రూ.8 గా ఉన్న స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (SAED) రూ.10/Ltr కి పెంచగా, లీటర్ పెట్రోల్ పై రూ.8 గా ఉన్న రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ని రూ. 10కి పెంచారు. ఐతే SAED మరియు రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూపంలో వసూలు చేసిన దాంట్లో రాష్ట్రాలకు ఎటువంటి ఉండదు కాబట్టి ఈ రెండు తీసేస్తే మిగిలిన రూ. 2.98 బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో మాత్రమే రాష్ట్రాలకు 42% వాటా ఉంటుంది.

ఐతే ఈ 42% లో కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిష్పత్తిలో వాటా ఉంటుంది. 14వ ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదనల మేరకు కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.305% వాటా వస్తుంది. వివరంగా చెప్పాలంటే పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే రూ. 2.8 బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా 58%(రూ. 1.73 పైసలు) తీసేస్తే మిగిలిన 42% (రూ.1.25 పైసలు)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 4.305% (రూ.0.05 పైసలు).

ఇక పెట్రోల్ పై రాష్ట్రాలు విధించే స్టేట్ VAT విషయానికి వస్తే, పెట్రోల్ పై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా VAT వసూలు చేస్తుంది. ఈ రోజు (18 మార్చి 2020) వరకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై 31% వ్యాట్ + Rs.2.76/litre వ్యాట్ ని విధిస్తుంది. ఈ వివరాల ఆధారంగా లెక్కిస్తే లీటర్ పెట్రోల్ పై రూ. 19.75 పైసలు స్టేట్ వ్యాట్ ని విదిస్తుంది.  

లీటర్ పెట్రోల్ పై స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా మొత్తం కలుపుకొని కేంద్ర ప్రభుత్వం రూ. 21.73 పైసలు పన్నుల రూపంలో వసూలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ వ్యాట్ మరియు బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా మొత్తం కలుపుకొని రూ. 19.80 పైసలు వసూలు చేస్తుంది. దీన్నిబట్టి లీటర్ పెట్రోల్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ పన్నులు వసూలు చేస్తుందని అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్ర పన్ను – Rs 29/Ltr. దేశంలో పెట్రోల్ మీద అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్? కాదు.
పెట్రోల్ పై వివధ రాష్ట్రాల పన్నుల వివరాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘Petroleum Planning and Analysis Cell’ వారి వెబ్సైటులో చూడవొచ్చు. ఈ రోజు (18 మార్చి 2020) పన్నుల ప్రకారం, పెట్రోల్ పై ఆంధ్రప్రదేశ్ 31% వాట్ + Rs.2.76/litre వాట్ అంటే Rs 19.74/Ltr పన్ను వేస్తున్నట్టు తెలుస్తుంది.

దేశంలో పెట్రోల్ మీద అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్ కంటే మధ్యప్రదేశ్ ఎక్కువ పన్ను వేస్తున్నట్టు ‘Petroleum Planning and Analysis Cell’ వారి వెబ్సైటులో చూడవొచ్చు. పెట్రోల్ పై ఆంధ్రప్రదేశ్ 31% వాట్ + Rs.2.76/litre వాట్ వేస్తే, మధ్యప్రదేశ్ 33% వాట్ + Rs.3.5/litre వాట్+1% సెస్ వేస్తున్నట్టు తెలుస్తుంది. 

చివరగా, తప్పుడు లెక్కలు పెట్టి, పెట్రోల్ ధరలో వివిధ పన్నుల వివరాలు అని షేర్ చేస్తున్నారు.

సవరణ (JULY 06, 2021): ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి వెళ్తుంది అని తప్పుగా పేర్కొనడం జరిగింది. కానీ 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టిన స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ డివిజబుల్ పూల్ లోకి రాదు, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కావున ఈ ఆర్టికల్ లోని వివరాలన్నీ అందుకు అనుగుణంగా మార్చటం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll